ఐదేండ్ల తర్వాత మంచిర్యాలకు కేసీఆర్

ఐదేండ్ల తర్వాత మంచిర్యాలకు కేసీఆర్

మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్​ఐదేండ్ల తర్వాత మంచిర్యాల జిల్లాకు వస్తున్నారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్​ప్రగతి స్టేడియంలో నిర్వహించిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన సీఎం డిసెంబర్​లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. రెండోసారి సీఎం అయిన తర్వాత మళ్లీ ఇప్పటివరకు రాలేదు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం నస్పూర్​లో నిర్మించిన కొత్త కలెక్టరేట్​ను, బీఆర్​ఎస్​ జిల్లా ఆఫీస్​ను ఓపెనింగ్​ చేస్తారు. కలెక్టరేట్ సమీపంలో 6.30 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే చెన్నూర్​ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీళ్లందించేందుకు రూ.1658 కోట్లతో నిర్మించనున్న చెన్నూర్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీంకు, మంచిర్యాల నియోజకవర్గంలో 10వేల ఎకరాలకు నీరందించేందుకు రూ.90 కోట్లతో నిర్మించనున్న పడ్తనపల్లి లిఫ్ట్​కు భూమిపూజ చేస్తారు. మందమర్రి సమీపంలో రూ.500 కోట్లతో పామాయిల్​ఇండస్ర్టీ, రూ.165 కోట్లతో మంచిర్యాల గోదావరిపై హైలెవల్​ బ్రిడ్జి, గుడిపేటలో మెడికల్​కాలేజీ నిర్మాణాలకు కూడా భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2,350 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

 ట్రాఫిక్​ డైవర్షన్ ...

నస్పూర్​లో కేసీఆర్​ పర్యటన సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్​డైవర్షన్​చేసినట్టు పోలీసులు తెలిపారు. గోదావరిఖని, చెన్నూర్​వైపు నుంచి మంచిర్యాల వైపు వచ్చే వెహికల్స్​శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ దగ్గర నుంచి ఎన్ హెచ్ 363, గాంధారి వనం మీదుగా మంచిర్యాల వైపు వెళ్లాలని సూచించారు. మంచిర్యాల వైపు నుంచి శ్రీరాంపూర్, చెన్నూర్, గోదావరిఖని వైపు వెళ్లే వెహికల్స్​మంచిర్యాల  ఐబీ చౌరస్తా, గాంధారి వనం దగ్గర నుంచి ఎన్​హెచ్​363 మీదుగా శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ వద్ద నుంచి వెళ్లాలన్నారు.