శేఖర్ మూవీ రివ్యూ

శేఖర్ మూవీ రివ్యూ
  • మలయాళ 'జోసెఫ్' సినిమాకు రీమేక్ 
  • కొత్తగా జోడించిన పాటలు
  • నిదానంగా సాగే కథాకథనాలు
  • సహజత్వంతో ఆకట్టుకునే రాజశేఖర్ నటన  

నటీనటులు : రాజశేఖర్, శివాని రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, అభినవ్ గోమటం, సమీర్, భరణి, ప్రకాష్ రాజ్.

సినిమాటోగ్రఫీ : మల్లికార్జున్

మ్యూజిక్ : అనూప్ రుబెన్స్

కథ : షాహి కబీర్.

డైలాగులు : లక్ష్మీ భూపాల్

నిర్మాతలు : శివాని, శివాత్మిక, సుధాకర్, శ్రీనివాసరెడ్డి

స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : జీవిత రాజశేఖర్

కల్కి మూవీ తర్వాత కరోనా వల్ల రాజశేఖర్ చాలా రోజులు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ‘శేఖర్’. మలయాళంలో విజయం సాధించిన ‘జోసెఫ్’ మూవీ రీమేక్ ఇది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కావడం, రాజశేఖర్ కు సూట్ అయ్యే పాత్ర కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ మూవీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తరహాలో ఉంటుంది. కుటుంబ పరిస్థితుల వల్ల స్పెషల్ క్రైమ్ ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్ ‘శేఖర్’(రాజశేఖర్) తాగుడుకు బానిసై ఉద్యోగాన్ని వదిలేస్తాడు. కొన్ని రోజుల తర్వాత తన భార్యకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసి వెళ్తాడు. ఆ యాక్సిడెంట్ వెనక కుట్ర ఉందని తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. తన కూతురు కూడా అలాగే చనిపోయిందని తెలుసుకొని షాక్ అవుతాడు. ఇంతకీ వాళ్ల చావులకి అసలు కారణాలేంటి..? వారిని ఎవరు..? ఎందుకు చంపారు..? 

‘శేఖర్’ మూవీ స్టోరీ కొత్తగా ఉంది. సిండికేట్ మాఫియాగా ఏర్పడి కొన్ని హాస్పిటల్స్ అవయవదానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయనే దాన్ని మలయాళం రైటర్ షాహి కబీర్ చాలా చక్కగా కథ రాశారు. మలయాళంలో ఈ సినిమా అక్కడి నెటివిటీకి తగ్గట్టు బాగా సెట్ చేశారు. అదే రీమేక్ కు వచ్చేసరికి నటీనటుల ఎంపిక వల్ల కలగా పులగం అయింది. సెకండాఫ్ చివరి పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇక మిగతా సినిమా అంతా ఎక్కడా పెద్దగా కనెక్ట్ కాదు. రాజశేఖర్ తన భార్య, కూతురు చనిపోయారని కుమిలిపోతుంటాడు. కానీ, ఆడియన్స్ కు అంతగా జాలి కలగదు. అలాగే చాలాసార్లు సెంటిమెంట్ డామినేట్ చేస్తుంది. అది ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ కాకపోవడం వల్ల బోరింగ్ గా సాగుతుంది.

ఇక రాజశేఖర్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించాడు. రిటైర్డ్ క్రైమ్ ఇన్విస్టిగేటివ్ ఆఫీసర్ గా సూట్ అయ్యాడు. ఒకటి, రెండు రొమాంటిక్ సీన్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఆత్మీయ రాజన్ ఫర్వాలేదనిపిస్తుంది. చిన్న పాత్రలో ముస్కాన్ బాగానే చేసింది. హీరోయిన్ గా ముస్కాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆతీయ రాజన్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా. మలయాళంలో ఆమె చేసిన పాత్రను తెలుగులోనూ ఆమెతోనే చేయించారు. కాస్త పేరున్న వారెవరినైనా తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. పాత్ర పరిధిలో శివాని నటన పర్వాలేదు. చివర్ లో వచ్చిన ప్రకాశ్ రాజ్ తనదైన మార్క్ చూపించారు.  అభినవ్ గోమటం, సమీర్, భరణి తమకు అలవాటైన పాత్రలే చేశారు. రాజశేఖర్ స్నేహితులుగా ఈ మూవీలో సమీర్, భరణి, రవివర్మ కనిపిస్తారు. 

మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ మ్యూజిక్ ఓకే అని చెప్పొచ్చు.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆర్ట్ వర్క్ ప్రొడక్షన్ వాల్యూయ్స్ బాగున్నాయి. ఇన్విస్టిగేషన్ కు సంబంధించిన కొంత సమాచారం ఆకట్టుకుంటుంది.  డైలాగులు పర్వాలేదనిపించాయి. ఓవరాల్ గా ఒరిజినల్ మూవీని ఉన్నది ఉన్నట్లుగా దించిన డైరెక్టర్ జీవిత రాజశేఖర్ నెటివిటీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారనే అనే చెప్పాలి. తెలుగుకి సంబంధించి ఈ కథలో మార్పులు చేసినట్లుగా అనిపించదు. కానీ, పాటలు మాత్రం పెట్టారు. దర్శకురాలిగా జీవిత రాజశేఖర్ దాదాపు ఒరిజినల్ కంటెంట్ నే ఫాలో అయ్యారని చెప్పాలి. మలయాళంలో సహజత్వానికి, ఫీలింగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తెలుగులోనూ అదే పద్ధతిలని అనుసరించడం వల్ల కథ చాలా స్లోగా  నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. సెంటిమెంట్, ఫ్యామిలీ ఎపిసోడ్ లో ఇంకా బాగా రాసుకోవాల్సింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్ కు వెళ్లి భరించడం కష్టమేనని చెప్పాలి. ఓటీటీలో కూడా పార్వర్డ్ చేసుకుంటూ చూడొచ్చు.