కోల్హాపురి చెప్పుల వివాదం తర్వాత ప్రైడా కీలక అడుగు: కళాకారులతో చర్చలకు బృందం

కోల్హాపురి చెప్పుల వివాదం తర్వాత ప్రైడా కీలక అడుగు: కళాకారులతో చర్చలకు బృందం

ప్రపంచవ్యాప్తంగా ప్రైడా (Prada) బ్రాండ్ 'కోల్హాపురి' స్ఫూర్తితో రూపొందించిన చెప్పులపై తలెత్తిన వివాదం తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విలాసవంతమైన ఫ్యాషన్ హౌస్ ఉన్నత స్థాయి బృందం ఈరోజు మహారాష్ట్రలోని కోల్హాపూర్ చేరుకుంది. రాత్రికి ఇక్కడి కళాకారులు, వ్యాపారులు, స్టేక్ హోల్డర్లతో చర్చ తర్వాత రేపు తిరిగి వెళ్లిపోనుంది. అలాగే మరో బృందం ఆగస్టులో ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.

గతంలో ప్రైడా తమ సరికొత్త కలెక్షన్‌లో భాగంగా 'లెదర్ శాండిల్స్' పేరుతో కోల్హాపురి చెప్పుల నమూనాను పోలిన డిజైన్‌ను విడుదల చేసింది. అయితే ఈ చెప్పుల ధరను రూ.90,000కు పైగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిని 'కోల్హాపురి'గా కాకుండా తమ స్వంత సృష్టిగా పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. భారతదేశంలో శతాబ్దాలుగా వాడుకలో ఉన్న, కేవలం కొన్ని వందల రూపాయలకే లభించే కోల్హాపురి చెప్పులను ఇంత భారీ ధరకు విక్రయించడం, వాటి మూలాన్ని విస్మరించడంపై నెటిజన్లు, కళాకారులు, మేధావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి ఈ వివాదం ప్రైడా బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసింది. 

దేశవ్యాప్తంగా చర్చ తర్వాత వెనక్కి తగ్గిన సంస్థ తాము రూపొందించిన డిజైన్‌కు 'కోల్హాపురి' చెప్పులే స్ఫూర్తి అని అంగీకరిస్తూ.. తమ వెబ్‌సైట్ నుంచి ఆ ఉత్పత్తులను తొలగించింది. ఇప్పుడు కేవలం వివాదాన్ని సద్దుమణిగేలా చేయడమే కాకుండా, నిజమైన కోల్హాపురి కళాకారులకు మద్దతుగా నిలిచేలా ప్రైడా ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నంలో ఉంది. మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ వివాదంపై స్పందించింది. తాము విక్రయిస్తున్న చెప్పులకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని అలాగే స్థానిక కళాకారులతో కలిసి వ్యాపారం చేసేందుకు ముందుకు రావాలని సూచించిన సంగతి తెలిసిందే.

కోల్హాపూర్‌కు చేరుకున్న ప్రైడా బృందం స్థానిక చెప్పుల తయారీదారులతో, కళాకారుల సంఘాలతో చర్చలు జరపనుంది. వారి నైపుణ్యాన్ని, చేతిపనిని దగ్గరగా పరిశీలించి, భవిష్యత్తులో వారితో కలిసి పనిచేసే అవకాశాలను అన్వేషించనుంది. ఇది కార్యరూపం దాల్చితే కోల్హాపురి కళాకారులకు అంతర్జాతీయ వేదిక లభించడమే కాకుండా, వారి అద్భుతమైన చేతిపని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇవ్వటంలో దోహదపడుతుంది. అయితే అంతర్జాతీయ బ్రాండ్ ప్రైడా వివాదం నుంచి పాఠాలు నేర్చుకుని స్థానిక సంస్కృతి, కళలకు గౌరవం ఇస్తూ ముందుకు రావడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.