హైద‌రాబాద్ మెట్రో సిటీ కావ‌డంతో భారీగా క‌రోనా కేసులు.. ప‌ల్లెల్లో త‌క్కువే: ఈట‌ల‌

హైద‌రాబాద్ మెట్రో సిటీ కావ‌డంతో భారీగా క‌రోనా కేసులు.. ప‌ల్లెల్లో త‌క్కువే: ఈట‌ల‌

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ‌ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అయితే రాష్ట్రంలో గ్రామాల్లో చాలా త‌క్కువ‌గానే క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని, హైద‌రాబాద్ జ‌న సాంద్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ మెట్రోపాలిట‌న్ సిటీ కావడంతో, ఇత‌ర సిటీల మాదిరిగానే ఇక్క‌డా భారీగా కేసులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. అదృష్ట‌వ‌శాత్తు నాలుగు నెల‌ల త‌ర్వాత కూడా క‌రోనా మ‌ర‌ణాలు తక్కువ‌గానే ఉన్నాయ‌ని, ప్ర‌జ‌ల్లోనూ భ‌యాందోళ‌న‌లు చాలా వ‌ర‌కు త‌గ్గాయ‌ని అన్నారు. మొదట్లో కరోనా వ‌స్తే చనిపోతారనే భయం ఉండేదన్నారు. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 3 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో ఇది 1.7 శాతం మాత్ర‌మేన‌ని అన్నారు మంత్రి ఈట‌ల‌. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో క‌రోనా చికిత్స మంచిగా లేద‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. పేషెంట్లు ఎప్పుడు వ‌చ్చినా ఆస్ప‌త్రిలో చేర్చుకుని చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశామ‌ని, 4700 మంది వైద్య సిబ్బందిని నియమించామని, 150 అంబులెన్సులు అదనంగా తీసుకున్నామని చెప్పారు. 17 వేల‌కు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు. వెంటిలేట‌ర్లు కూడా వెయ్యి వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. నిన్న‌ చెస్ట్ ఆసుపత్రిలో చ‌నిపోయిన వ్య‌క్తి చాలా ఆస్ప‌త్రులు తిరిగి.. చివ‌రికి రాత్రికి చెస్ట్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చార‌ని, ఆ స‌మ‌యంలో వ‌చ్చినా అడ్మిట్ చేసుకున్నార‌ని తెలిపారు ఈట‌ల‌. అత‌డి మృతిపై జ‌రుగుతున్న ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని చెప్పారు. వైద్యులు ఫ్రంట్ లైన‌ర్లుగా పోరాడుతున్నార‌ని, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌యొద్ద‌ని కోరారు.

గాంధీ హాస్పిట‌ల్‌కు నేరు వ‌స్తే చేర్చుకోరు.. కింగ్ కోఠీ, చెస్ట్ ఆస్ప‌త్రిలో ఓపీ

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మంచి వైద్యం అందుతోంద‌ని చెప్పారు మంత్రి ఈట‌ల‌. క‌రోనా ఉందేమోన‌న్న అనుమానంత‌తో ఎవ‌రైనా వ‌స్తే గాంధీ ఆస్ప‌త్రిలో నేరుగా చేర్చుకోర‌ని, అక్క‌డ ఓపీ స‌దుపాయం లేద‌ని తెలిపారు. కింగ్ కోఠి హాస్పిట‌ల్, చెస్ట్ హాస్పిట‌ల్‌లో ఏ స‌మ‌యంలో వ‌చ్చినా చేర్చుకుని వైద్యం అందిస్తార‌ని, క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని మాత్ర‌మే గాంధీకి త‌ర‌లిస్తార‌ని వెల్ల‌డించారు. ఆరోగ్యశాఖలో 250 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్‌ వచ్చిందని, కరోనాతో హెడ్‌ నర్సు చనిపోయిందని తెలిపారు మంత్రి ఈట‌ల‌. వైద్యులు ప్రాణాలు పణంగాపెట్టి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 184 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వారు కోలుకుంటున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో సీరియ‌స్ కండిష‌న్‌లో ఉన్న కేసులు ప‌ది మాత్ర‌మేన‌ని, ఆ ప‌ది మంది గాంధీ ఆస్ప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు.

మళ్లీ భారీగా కరోనా పరీక్షలు

కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి ఈట‌ల‌. రేపటి నుంచి మళ్లీ భారీగా కరోనా పరీక్షలు కొనసాగుతాయన్నారు. ప్ర‌స్తుతం రోజుకు 4 వేల టెస్టులు చేస్తున్నామ‌న్నారు. హైద‌రాబాద్‌లో సిటీ కాబ‌ట్టే ఇత‌ర సిటీల్లానే ఎక్కువ సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని చెప్పారు. వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ బాగా పెరుగుతున్నాయ‌ని, టెస్టులు కూడా పెంచాల‌ని సీఎం ఆదేశించార‌ని తెలిపారు. ల‌క్ష‌ణాలు పెద్ద‌గా లేని వారిని హోం ఐసోలేష‌న్‌లోనే పెట్టాల‌ని చెప్పార‌న్నారు. హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు పెరిగిన చోట జీహెచ్ఎంసీ సిబ్బందితో క‌లిసి ఆరోగ్య శాఖ ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. ప‌ల్లెల్లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు కూడా చాలా త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని మంత్రి వివ‌రించారు. లాక్ డౌన్ పెట్టాలంటే క‌ష్ట‌మ‌ని, అవ‌స‌ర‌మైతే కేబినెట్‌లో చ‌ర్చిస్తామ‌ని చెప్పారు.