
- తిలక్ డకౌట్.. బదోనీకి ఐదు వికెట్లు
హైదరాబాద్, వెలుగు: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (132) సెంచరీతో సత్తా చాడటంతో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–డి మ్యాచ్‌లో ఢిల్లీకి హైదరాబాద్ దీటుగా బదులిస్తోంది. అయినా జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కే అవకాశం కనిపించడం లేదు. డ్రా దిశగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 77/1తో ఆట కొనసాగించిన హైదరాబాద్ మూడో రోజు, శుక్రవారం చివరకు 106.4 ఓవర్లలో 400/7తో నిలిచింది. ఢిల్లీ ఆల్‌రౌండర్ ఆయుష్ బదోనీ (5/69) ఐదు వికెట్లతో దెబ్బకొట్టాడు.
అన్‌డౌన్ బ్యాటర్ అనికేత్ రెడ్డి (87)తో కలిసి మూడో వికెట్‌కు 140 రన్స్ జోడించిన తన్మయ్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కానీ, అనికేత్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీసిన బదోనీ ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. అతని బౌలింగ్‌లోనే కెప్టెన్, తిలక్ వర్మ (0) డకౌటవ్వడం హైదరాబాద్‌ను దెబ్బతీసింది. హిమతేజ (29), రోహిత్ రాయుడు (3) కూడా నిరాశ పరచగా.. వరుణ్ గౌడ్ (57) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రాహుల్ రాదేశ్ (41 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మరో రోజు ఆట మిగిలున్న మ్యాచ్‌లో ఢిల్లీ స్కోరుకు హైదరాబాద్ ఇంకా 129 రన్స్ దూరంలోనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఇంకా 452 రన్స్ వెనకబడి ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌ను ఢిల్లీ 529/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆటకు శనివారం చివరి రోజు.