విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇవి తప్పనిసరి

విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇవి తప్పనిసరి

కొవిడ్  తగ్గిన తర్వాత చాలామంది ఫారిన్ టూర్లు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తున్నవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..

విదేశాలకు వెళ్లాలనుకుంటే కచ్చితంగా పాస్‌‌పోర్ట్ ఉండాలి. కాబట్టి టూర్ ప్లానింగ్‌‌కు కొన్ని నెలల ముందే పాస్‌‌పోర్ట్‌‌కు అప్లై చేసుకోవడం మంచిది. కొన్ని దేశాలకు ప్రయాణించాలంటే పాస్‌‌పోర్ట్‌‌తో పాటు వీసా కూడా అవసరం. దేశాన్ని బట్టి వీసా ధరలు మారుతుంటాయి. యూరప్, అమెరికా దేశాలకు వెళ్లాలంటే వీసాను ముందే అప్లై చేసుకోవాలి.  థాయ్‌‌లాండ్, కాంబోడియా, వియత్నాం, మాల్దీవ్స్ వంటి దేశాలు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంటే ఆ దేశానికి వెళ్లిన  తర్వాత వీసా పొందొచ్చు. విదేశాలకు వెళ్లాలను కుంటున్న వాళ్లు ట్రావెల్ ఇన్సూరెన్స్‌‌ కూడా తీసుకోవాలి. ఇన్సూరెన్స్ లేకపోతే కొన్ని దేశాలు అనుమతించవు. విదేశాల్లో హెల్త్ ఇష్యూస్ వచ్చినా, పాస్‌‌పోర్ట్, లగేజీ లాంటివి పోయినా, ఏవైనా కారణాల వల్ల ట్రిప్ రద్దయినా ఇన్సూరెన్స్ కంపెనీ సాయం చేస్తుంది. ఇండియా పాస్‌‌పోర్ట్‌‌తో  భూటాన్, నేపాల్, మారిషస్, ఇండోనేసియా, సెర్బియా లాంటి దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణించొచ్చు.

కొన్నిదేశాలకు వెళ్లేముందు కచ్చితంగా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కెన్యా, టాంజానియా లాంటి ఆఫ్రికన్ దేశాలకు వెళ్లే ముందు ఎల్లో ఫీవర్‌‌ వ్యాక్సిన్‌‌ తీసుకోవాలి. విదేశాల్లో మనదేశ కరెన్సీ చెల్లదు. కాబట్టి డబ్బుని అక్కడి కరెన్సీలోకి మార్చుకోవాలి. దీనికోసం కొంత కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు కట్టాలి. అలాగే విదేశాల్లో ఇక్కడి డెబిట్, క్రెడిట్ కార్డ్‌‌లు వాడితే బ్యాంకులు అదనపు ఛార్జీలు, ఎక్స్ఛేంజ్ చార్జీలను వసూలు చేస్తాయి. విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడ ఉండబోయే హోటల్ వివరాలు, రిటర్న్ టికెట్ వివరాలు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ ముందే బుక్ చేసుకోవాలి.

విదేశాల్లో ఉన్నప్పుడు అత్యవసర సాయం కావాలనుకుంటే అక్కడ ఉండే ఇండియన్ ఎంబసీని సంప్రదించొచ్చు. ఇతర దేశాల్లో ఇక్కడి సిమ్ పనిచేయదు. కాబట్టి ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్ తీసుకోవాలి. లేదా వెళ్లిన దేశంలో లోకల్ సిమ్ తీసుకోవడం బెటర్.