మూడున్నరేండ్లకు మళ్లీ షురూ .. జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభం

మూడున్నరేండ్లకు మళ్లీ షురూ .. జీహెచ్ఎంసీలో ప్రజావాణి ప్రారంభం
  •  అన్ని చోట్ల అందిన 83 ఫిర్యాదులు 
  •    సమస్యలు పరిష్కరించాలని మేయర్‌‌‌‌కు కార్పొరేటర్ల వినతి  
  •    ఓయో రూమ్స్, హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు

హైదరాబాద్, వెలుగు: బల్దియాలో మూడున్నరేళ్ల తర్వాత ప్రజావాణి తిరిగి సోమవారం ప్రారంభమైంది. టౌన్‌‌ ప్లానింగ్, ట్యాక్స్‌‌, తదితర సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. కరోనా సమయంలో 2020 మార్చి17న బంద్‌‌ పెట్టారు. మళ్లీ షురువైన ప్రజావాణిలో గ్రౌండ్ లెవెల్​లో పర్యవేక్షణ లేకపోగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.

కొన్ని చోట్ల 100, 150 చదరపు గజాల్లో ఆరేడు అంతస్తుల్లో నిర్మాణాలు చేస్తున్నారని, తనిఖీలు లేకపోగా స్థానిక టౌన్‌‌ ప్లానింగ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.  ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామంటే బంద్ ఉంది.  బల్దియాలోని 6 జోన్లతో పాటు 30 సర్కిల్ ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహించారు. ఎల్ నగర్ జోన్ లో 22,  సికింద్రాబాద్ జోన్ లో 11, ఖైరతాబాద్ జోన్ లో 8, శేరిలింగంపల్లి జోన్​లో 16,  కూకట్​పల్లి జోన్​లో 12,  చార్మినార్ జోన్​లో 14 ఫిర్యాదులు అందాయి.  వచ్చే సోమవారం నుంచి హెడ్డాఫీసులో  కూడా ప్రజావాణి జరగనుంది.

ఎల్​బీనగర్ జోన్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఇక్కడ ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు చెప్పారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మేయర్​ను కోరారు.

ఒయో రూమ్స్​లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణనగర్ వాసి ఫిర్యాదు చేశారు.  ఇండ్ల మధ్యలో హాస్టల్స్ ఉండటంతో  న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని, అనుమతులు లేకుండానే హాస్టల్స్ నడుస్తున్నాయని ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి పాల్గొన్నారు.

కుక్కల బెడద నివారిస్తం : మేయర్​ విజయలక్ష్మి 

సిటీలో వీధి కుక్కల బెడద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మేయర్​విజయలక్ష్మి తెలిపారు. సోమవారం బల్దియా హెడ్డాఫీసులో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్, వెటర్నరీ అధికారులు, హై లెవెల్ కమిటీ సభ్యులైన కార్పొరేటర్లతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ... వీధి కుక్కల బెడద నుంచి జనాలను రక్షించడానికి హై లెవెల్ కమిటీ సూచన మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటి బర్త్ కంట్రోల్ (ఏబీసీ) చర్యలు తీసుకుంటామన్నారు.

వీధి కుక్కలకు రెగ్యులర్​గా రేబిస్ వ్యాక్సిన్ అందించేందుకు వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శేరిలింగంపల్లిలో ఎకరం విస్తీర్ణంలో వీధి కుక్కలకు షెల్టర్​ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని హై లెవెల్ కమిటీ సభ్యులు సూచించారు.

జోన్ల వారీగా సమీక్షించాలని, కుక్కలకు మంచినీరు, సమయానికి ఫీడింగ్ అందించాలన్నారు. మటన్, చికెన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను ఖాళీ స్థలంలో పారవేయకుండా డస్ట్ బిన్​లో వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు వెటర్నరీ అడిషనల్ కమిషనర్ చీఫ్ ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు.
 
ప్రజావాణి దరఖాస్తులను తొందరగా పరిష్కరించాలి

హైదరాబాద్, వెలుగు: ప్రజావాణికి వచ్చే అర్జీలను తొందరగా పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్​లోని జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వివిధ మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆయా మండలాల పరిధిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.  

జవహర్​నగర్ మేయర్ మేకల కావ్యపై ఫిర్యాదు

శామీర్​పేట:  మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్వో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ పాల్గొని 193 అర్జీలు స్వీకరించారు. జవహర్​నగర్​లోని సర్వే నంబర్లు 476, 501లోని రూ.కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని జవహర్ నగర్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్య, ఆమె తండ్రి అయ్యప్ప, కుటుంబ సభ్యులు అక్రమంగా కబ్జా చేసి ఫాంహౌస్, స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారని కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్, బీఆర్ఎస్ నాయకురాలు శ్వేత ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.

ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న మేయర్ మేకల కావ్య, ఆమె తండ్రి అయ్యప్ప, వారికి సహకరిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నం. 886లోని 19 ఎకరాలు, 887లోని 10 ఎకరాలు, 295లోని 324 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి ప్రహరీ నిర్మిస్తున్నారంటూ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 

కబ్జాకు గురైన భూమిపై విచారణ జరిపించాలి
 
జీడిమెట్ల:  కుత్బుల్లాపూర్ సెగ్మెంట్​లో కబ్జాకు గురైన రూ.25 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ పరిధి నిజాంపేట, దుండిగల్ మున్సిపాలిటీల్లోని రూ. వేల కోట్ల భూమి కబ్జాకు గురైందన్నారు. ఈ కబ్జాలతో సంబంధం ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.