- జీసీసీ గోదాముల్లో 7 వేల క్వింటాళ్లు నిల్వ..
- ఇప్పపువ్వు సేకరణకు అడవిబాట పట్టిన గిరిజనులు
ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వు గత మూడేళ్లుగా గోదాముల్లో నిల్వ ఉంది. పాత నిల్వలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొత్తగా కూడా సేకరణ జరగలేదు. తాజాగా ఐటీడీఏ పీవో మంద మకరందు నిల్వ ఉన్న ఇప్పపువ్వు విక్రయానికి టెండర్లు ఆహ్వానించారు.
డివిజన్ పరిధిలోని ఉట్నూర్, జన్నారం, పెంబీ, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కామారెడ్డి, ఇచ్చోడ గోదాముల్లో నిల్వ ఉన్న 7,798 క్వింటాళ్ల ఇప్పపువ్వును విక్రయించనున్నారు. ఆసక్తిగల వ్యాపారులు దరఖాస్తులు, నిల్వల వివరాలు, ధరావతు సొమ్ము, నియమ నిబంధనల కోసం ఉట్నూర్‌లోని జీసీసీ లిమిటెడ్ డివిజనల్ కార్యాలయంలో సంప్రదిస్తున్నారు. టెండర్లను మే 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
- రూ.2 కోట్ల విలువైన ఇప్పపువ్వు..
ఉట్నూర్ డివిజన్ పరిధిలో ప్రతి ఏడాది వేసవిలో ఇప్పపువ్వు సేకరిస్తారు. ప్రస్తుతం గిరిజనులు సేకరించే ఇప్పపువ్వుకు కిలోకు రూ.30 చెల్లిస్తున్నారు. ఇలా గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి ప్రతి ఏడాది టెండర్ల ద్వారా వ్యాపారులకు విక్రయిస్తారు. కానీ గత మూడేళ్లుగా విక్రయాలు, సేకరణ ఆగిపోయింది. ప్రస్తుతం డివిజన్ పరిధిలోని ఉట్నూర్, జన్నారం, పెంబీ, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, కామారెడ్డి, ఇచ్చోడ గోదాముల్లో ఇప్పపువ్వు నిల్వలు ఉన్నాయి.
ఏళ్ల తరబడి నిల్వ ఉంచడంతో వాటి నాణ్యత దెబ్బతింటోంది. వ్యాపారులు తక్కువ కోట్ చేస్తే జీసీసీకి నష్టం తప్పదు. గతంలో హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో ఇప్పపువ్వు అమ్మకానికి టెండర్లు పిలిచేవారు. ఈ ఏడాది మాత్రం పీవోకు అనుమతి ఇవ్వడంతో మూడేళ్ల తర్వాత ఇప్పప్పువ్వు విక్రయించేందుకు టెండర్లకు మోక్షం కలిగింది. ప్రస్తుతం గోదాముల్లో ఉన్న 7,798 క్వింటాళ్ల ఇప్పపువ్వు విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరిజనుల నుంచి కిలో రూ.30కి కొనుగోలు చేస్తున్న జీసీసీ టెండర్ దారులు అంతకంటే ఎక్కువ చెల్లిస్తేనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన రాష్ట్రానికి చెందిన వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో మిగతా రాష్ట్రాల వ్యాపారులపైనే అమ్మకాలు ఆధారపడి ఉన్నాయి
ఇప్పపువ్వు ధరపై గిరిజనుల అసంతృప్తి..
మూడేళ్లుగా కొత్తగా ఇప్పపువ్వు సేకరణ లేకపోవడంతో గిరిజనులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. తాజాగా పాత ఇప్పపువ్వుకు టెండర్లు ఆహ్వానించడంతో గిరిజనులు మరోసారి ఇప్పపువ్వు కోసం అడవి బాట పడుతున్నారు. ఒక కిలో ఇప్పపువ్వు సేకరించేందుకు దాదాపు గంట సమయం పడుతుంది. కిలోకు రూ.30 మాత్రమే చెల్లిస్తుండడంతో గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- టెండర్లు ఆహ్వానించాం
డీఎం మూడేళ్ల తర్వాత ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఇప్పపువ్వు అమ్మకాలకు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియ ప్రారంభించాం. ఆసక్తిగల వ్యాపారులు ఈ నెల 18 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 7,798 క్వింటాళ్ల ఇప్పపువ్వు అందుబాటులో ఉంది. వ్యాపారులు విజిట్ చేసిన తర్వాత టెండర్లు వేసే అవకాశం ఉంది. ఇప్పపువ్వు సేకరణ కూడా జోరుగా సాగుతోంది.
- గుడిమల్ల సందీప్ కుమార్, ఉట్నూర్ జీసీసీ
