
ఎసిడిటీ నివారణ కోసం డాక్టర్లు ఎక్కువగా రాసే రానిటిడిన్ మందులో కేన్సర్ కారకాలున్నాయన్న అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) హెచ్చరికల నేపథ్యంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అప్రమత్తమైంది. అందులో కేన్సర్ కారకాలున్నాయో లేవో తేల్చాలంటూ అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ఆఫీసులకు లేఖలు రాసింది. ప్రతి రాష్ట్రంలో రానిటిడిన్ మందును తయారు చేస్తున్న కంపెనీలకు లోకల్ ఆఫీసర్లు వెళ్లి, ఈ మందును చెక్చేయాలని ఆదేశించింది. మందు క్వాలిటీ ఎలా ఉంది? రోగులకు సురక్షితమైనదేనా? కాదా? అన్నది పరీక్షించాలని సూచించింది. ఫ్రెంచ్ కంపెనీ సనోఫీ, జాంటాక్ పేరుతో తయారు చేస్తున్న రానిటిడిన్ మాత్రల్లో కేన్సర్ కారకమైన ఎన్–నైట్రోసోడిమిథైల్అమైన్ (ఎన్డీఎంఏ) స్వల్ప స్థాయిలో ఉందని ఎఫ్ డీఏ ఇటీవల వెల్లడించింది. అయితే, ఈ మందును వాడొద్దని తాము చెప్పడం లేదని, దీని గురించి పేషెంట్లు డాక్టర్లతో చర్చించి, వారి సలహా తీసుకున్న తర్వాతే వాడాలని ఇటీవల సూచించింది.
రానిటిడిన్ ను నిలిపేసిన రెడ్డీస్ ల్యాబ్స్
మన దేశంలో రానిటిడిన్ను రెడ్డీస్ ల్యాబ్స్ (రానిటిడిన్ హైడ్రోక్లోరైడ్), జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (రాంటాక్), కాడిలా ఫార్మాస్యూటికల్స్ (ఎసిలాక్), గ్లాక్సోస్మిత్ క్లైన్ (జినెటాక్), హెటిరో డ్రగ్స్ (లూపిన్) వంటి కంపెనీలు తయారు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రానిటిడిన్ మందుపై నిషేధం విధించనప్పటికీ, రెడ్డీస్ ల్యాబ్స్ గత వారమే రానిటిడిన్ సరఫరాను నిలిపేసింది. జేబీ కెమికల్స్ కంపెనీ తయారు చేస్తున్న మందును స్వచ్ఛందంగా పరీక్షల కోసం పంపింది. ఎన్డీఎంఏ కేన్సర్ కలిగించే రసాయనమని, అది పర్యావరణంలోకి చేరితే నీరు, ఆహారం, మాంసం, డైరీ ప్రొడక్ట్స్, కూరగాయల్లో కూడా ఉండవచ్చని సైంటిస్టులు గతంలోనే వెల్లడించారు. దీంతో తాజాగా ఎఫ్డీఏ హెచ్చరికల తర్వాత కెనడా, సింగపూర్ దేశాలు ముందు జాగ్రత్తగా రానిటిడిన్ మందును రీకాల్ చేయాలని నిర్ణయించాయి. కాగా, రానిటిడిన్ మాత్రలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్నారు. ఇది కడుపులో యాసిడ్ వల్ల ఏర్పడే మంటను తగ్గిస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో అల్సర్లు రాకుండా నివారిస్తుంది.