
నీట మునిగిన వందలాది కాలనీలు
లోతట్టు ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళన
బస్తీల్లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద
ఓల్డ్ మలక్ పేట్ లో కరెంట్ షాక్ తో ఒకరు మృతి
మరో మూడు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్, వెలుగు: మొన్నటి వానలకే ఆగమాగమైన హైదరాబాద్‌ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. శనివారం సాయంత్రం మొదలై అర్ధరాత్రి వరకూ దంచికొట్టింది. దీంతో ముంపు ప్రాంతాల్లోకి మరోసారి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ మోకాళ్ల లోతు నీళ్లతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. మంగళవారం కురిసిన కుండపోత వానతో చెరువుల కట్టలు తెగి, నాలాలు ఉప్పొంగి.. వందలాది కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇప్పటికీ అనేక కాలనీల్లో ఆ నీరు పోలేదు. కొన్ని చోట్ల వరద తగ్గినా.. బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనుల్లో జనం నిమగ్నమయ్యారు. ఇంతలోనే వాన అందుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. మొన్నటిలాగానే ఇప్పుడు కూడా ఆఫీసర్లు ముందస్తుగా అలర్ట్ చేయకపోవడంతో లోతట్టు ప్రాంతాలవాళ్లు బిక్కుబిక్కుమంటూ పరుగులు తీయాల్సి వచ్చింది. ఇప్పటికే చెరువులు ఎఫ్టీఎల్ లెవెల్‌కి పూర్తిగా నిండిపోయాయి. మళ్లీ భారీ వర్షం వల్ల చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి 11 గంటల వరకు ఘట్‌కేసర్‌లో 18.1 సెంటీమీటర్లు, సరూర్‌నగర్‌లో 16.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ఏరియాల్లో 10 సెంటీమీటర్లకు పైగానే
వర్షపాతం నమోదైంది.
మోకాళ్ల లోతు నీళ్లు, ట్రాఫిక్ జామ్
శనివారం పడ్డ వానకు రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. మెయిన్ రోడ్లపైన కూడా మోకాళ్లలోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి. చింతల్ కుంట, ఎల్బీనగర్, పంజాగుట్ట, సాగర్ రింగ్ రోడ్డు, బంజారాహిల్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, ఖైరతాబాద్ సహా ప్రధాన ప్రాంతాల్లో వాటర్ జామ్ అయింది. నాలాలు, మ్యాన్ హోల్స్ పొంగి నీళ్లు రోడ్లపైకి వచ్చాయి. చాలా చోట్ల ఇండ్లలోకి, అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి భారీగా నీళ్లు వచ్చాయి. సరిగ్గా జనం ఎక్కువగా బయటకు వచ్చే టైమ్ లో వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్‌ఘాట్, కోఠి, బేగంపేట్, పంజాగుట్ట, మలక్ పేట్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సికింద్రాబాద్, ప్యారడైస్,రాణిగంజ్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, టోలీచౌకి, గచ్చిబౌలి, సాగర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధాన రహదారుల్లో జనం గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. విజయవాడ హైవే లో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
ఫలక్‌నుమా బ్రిడ్జి మూసివేత
ఫలక్‌నుమా బ్రిడ్జి పక్కనే ఉన్న అల్ జుబైర్ కాలనీ మళ్లీ నీట మునిగింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బ్రిడ్జికి గండిపడింది. దీంతో ఆఫీసర్లు బ్రిడ్జి కూలే ప్రమాదముందని బ్రిడ్జిపై రాకపోకలు నిలివేశారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిటీలో దాదాపు వెయ్యి కాలనీలు, బస్తీల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
కరెంట్ షాక్‌తో ఒకరి మృతి
ఓల్డ్ మలక్ పేటలో రోడ్డుపై వెళ్తున్న ఓ కూలీ కరెంట్ షాక్ తో చనిపోయాడు. మలక్ పేట యశోదా హాస్పిటల్ చౌరస్తా నుంచి శంకర్ నగర్ లోని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా భారీ వర్షం రావటంతో ఫుట్ పాత్ పైకి వస్తూ కరెంట్ స్తంభాన్ని పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి అక్కడిక్కడే ప్రాణాలువదిలాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములు(40) గా గుర్తించారు. చైతన్య పురిలోని కమలానగర్ రోడ్డు నెంబర్– 5 లో వరద రావటంతో నలుగురు అందులో కొట్టుకుపోయారు. వెంటనే స్థానికులు గమనించి వారిని కాపాడారు. లోతట్టు ప్రాంతాల్లో జనం అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ ఆఫీసర్లు సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో టెన్షన్
మొన్నటి భారీ వర్షానికి ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు, బస్తీలు, కాలనీలు వందల సంఖ్యలో ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మళ్లీ ఆయా ఏరియాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చెరువులన్నీ ఫుల్ గా నిండటంతో మళ్లీ వర్షానికి పొంగి చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఐదురోజులుగా ఇంట్లోంచి బయటకు రాలేక…తిండి, తిప్పలు లేక లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కూడా లేని ఏరియాలు వందల్లోనే ఉన్నాయి. శనివారం నాటి వర్షం వారిని మరింత ఆగం చేసింది.
For More News..