
ఇంటర్ బోర్డు తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఫలితాల్లో తప్పులు రావడంతో ఇప్పటికే 20 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇది పెద్దదుమారం సృష్టించింది. అయినా బోర్డు తీరులో మార్పు రాలేదు. మళ్లీ అదే తప్పులు చేస్తోంది. హైదరాబాద్ కు చెందిన అనామిక అనే అమ్మాయి.. తెలుగులో 20 మార్కులు రావడంతో ఫెయిల్ అయినట్టు.. మొదట ఫలితం ప్రకటించింది ఇంటర్ బోర్డు. పరీక్షలో ఫెయిలయ్యానన్న బాధతో అమ్మాయి ప్రాణాలు తీసుకుంది.
అయితే.. రీ వెరిఫికేషన్ ఫలితాల్లో మాత్రం.. అమ్మాయి పాసైనట్టు బోర్డు ప్రకటించింది. రీ వాల్యుయేషన్ లో 48 మార్కులు వచ్చినట్టు మెమోను.. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పెట్టింది. పాసైన తమ సోదరిని.. ఫెయిల్ అయినట్టు ప్రకటించి.. ఆమె చనిపోవడానికి కారణమయ్యారని.. అనామిక సోదరి ఆరోపించారు. ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని.. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై సాయంత్రానికే ఇంటర్ బోర్డు మాట మార్చింది. అనామిక సోదరి చెప్పిన మాటలు తప్పంటూ ఆరోపించింది. రీ వెరిఫికేషన్ లో 20 మార్కులకు కేవలం 1 మార్కు పెరిగి.. 21 మార్కులే వచ్చాయని చెప్పింది. రీ వెరిఫికేషన్ లో 48 మార్కులు రాలేదని చెప్పింది. ఆన్సర్ షీట్ కూడా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశామంది.
అయితే.. రీ వెరిఫికేషన్ లో 21 మార్కులే వచ్చినా.. వాటిని అప్ లోడ్ చేయడంలో మిస్టేక్ జరిగిందని.. అందుకే 21 మార్కులు… కాస్త 48గా… సిబ్బంది అప్ లోడ్ చేశారని ఓ ప్రకటన విడుదల చేసింది. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో ఈ తప్పు జరిగిందని.. దీనిపై విచారణకు కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది.


