IND vs ENG 2025: ఒత్తిడిలో టీమిండియా కెప్టెన్.. గిల్‌ను చుట్టేసిన 10 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు

IND vs ENG 2025: ఒత్తిడిలో టీమిండియా కెప్టెన్.. గిల్‌ను చుట్టేసిన 10 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అత్యద్భుతంగా ఆడితే కనీసం డ్రా చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ నాలుగో రోజే ఇండియాను చుట్టేద్దామనే కసితో కనిపిస్తుంది. 311  పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఇంగ్లాండ్.. మాంచెస్టర్ టెస్టులో సేఫ్ జోన్ లో నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియాకు ఘోరమైన ఆరంభం లభించింది. తొలి ఓవర్ లోనే ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడేసి టీమిండియాను కష్టాల్లో పడేశాడు. 

ALSO READ | AUS vs WI: 37 బంతుల్లో ఆసీస్ పవర్ హిట్టర్ సెంచరీ.. పండగ చేసుకుంటున్న RCB ఫ్యాన్స్

ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఒక ఔట్ స్వింగ్ తో జైశ్వాల్ ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో ఆ తర్వాత బంతికే సాయి సుదర్శన్ ను తొలి బంతికే ఔట్ చేసి మన జట్టుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో వికెట్లు తీసిన వోక్స్ హ్యాట్రిక్ తీసుకునే అవకాశం లభించింది. ఆరో బంతికి గిల్ కోసం బెన్ స్టోక్స్ ప్రయోగాత్మక ఫీల్డింగ్ ను సెట్ చేశాడు. ఒక్క ఫీల్డర్ ను తప్పితే మిగిలిన వారందరినీ సర్కిల్ లో తీసుకొచ్చాడు. ఈ ఫీల్డ్ సెటప్ లో వికెట్ కీపర్ తో పాటు ఐదుగురు స్లిప్ లో ఉన్నారు. లెగ్ స్లిప్ లో ఒకరు.. షార్ట్ కవర్స్ మరొకరు.. షార్ట్ మిడాన్ లో ఒకరిని ఫీల్డింగ్ సెట్ చేశాడు.

గిల్ పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. ఆరో బంతికి వోక్స్ బంతిని డిఫెన్స్ ఆడడంలో గిల్ విఫలం కావడంతో బాల్ ప్యాడ్లకు తగిలింది. దీంతో అక్కడే ఉన్న ఇంగ్లాండ్ 10 మంది ఆటగాళ్లు గిల్ చుట్టూ చేరి అప్పీల్ చేసి టీమిండియా కెప్టెన్ ను తీవ్ర ఒత్తిడిలో పడేశారు. ప్రారంభంలో ఇబ్బంది పడిన గిల్.. ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించాడు. రాహుల్ తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. గిల్ (45), రాహుల్ (20) క్రీజ్ లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 244 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 358 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోర్ చేసింది.