
ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో కేవలం 37 బంతుల్లోనే సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. శనివారం (జూలై 26) ఉదయం వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లో 102* పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. తన ధనాధన్ ఇన్నింగ్స్ తో డేవిడ్ ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. జోష్ ఇంగ్లిస్ 43 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు.
పవర్ ప్లే చివరి ఓవర్ లో బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్న ఈ ఆసీస్ వీరుడు 37 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ ఆసీస్ ఫినిషర్ ఇన్నింగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఐపీఎల్ లో డేవిడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తమ జట్టు ఆటగాడు సెంచరీని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోవడం విశేషం. 2025 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున డేవిడ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మ్యాచ్ తో పాటు మరో రెండు మ్యాచ్ లు ఉండగానే 3-0 తేడాతో సిరీస్ ను కూడా గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ సెంచరీ (102)తో చెలరేగితే.. బ్రాండన్ కింగ్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 16.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలిచింది. టైమ్ డేవిడ్ (102*) సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ అడగా.. మిచెల్ ఓవెన్ 16 బంతుల్లోనే 36 పరుగులు చేసి వేగంగా ఆడాడు.
TIM DAVID SMASHES THE FASTEST T20I HUNDRED FOR AUSTRALIA!
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
🔗 https://t.co/Q72MV0BORj pic.twitter.com/BDcnNkK9Ud