ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని..

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని..
  • ప్రేమను వ్యతిరేకించిన పెద్దలు
  • ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
  • దవాఖానకు తరలిస్తుండగా యువతి మృతి
  • యువకుడి పరిస్థితి విషమం

ఏటూరునాగారం, వెలుగు: వయస్సు తేడా వారిద్దరి ప్రేమకు అడ్డమైంది. అబ్బాయి చిన్నవాడు..అమ్మాయి పెద్దది కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు అడ్డు చెప్పి మందలించారు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం..ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలకు చెందిన కొమురం ప్రభాస్​(20), పక్క ఊరైన మహబూబాబాద్​జిల్లా గంగారం మండలం దుబ్బగూడెంకు చెందిన సువర్ణపాక యమున (24) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరిదీ ఒకటే కులం. అయితే అమ్మాయి కంటే అబ్బాయి వయస్సులో చిన్నవాడు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతోపాటు అమ్మాయి స్వగ్రామమైన దుబ్బగూడెంలో సోమవారం పెద్ద మనుషులు పంచాయితీ పెట్టారు. అక్కడ కూడా వీరి ప్రేమను వ్యతిరేకించడంతో మనస్తాపం చెందారు. తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. మంగళవారం అబ్బాయి ఊరైన లింగాలలోని గ్రామ పొలిమేరలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. గమనించిన కొందరు 108లో ములుగు ఏరియా దవాఖానకు తరలిస్తుండగా యమున చనిపోయింది. ప్రభాస్​పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్​ఎంజీఎంకు తరలించారు.