హనుమకొండ, వెలుగు : ఎవరైనా ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ హెచ్చరించారు. జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. 'అవినీతికి పాల్పడను.. ప్రోత్సహించను.. సహించను' అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్ తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారులు అవినీతికి పాల్పడకుండా అన్ని ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, లోక్ సత్తా, ఉద్యమ సత్తా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 8 దశాబ్దాలు అవుతున్నా అవినీతి మాత్రం తగ్గడం లేదన్నారు. ఇప్పటివరకు 79 క్యాలెండర్లు మారినా ప్రభుత్వ శాఖల్లో లంచాల పరిస్థితి మాత్రం మారడం ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతిపరులకు శిక్షపడేలా పౌరులను చైతన్యం చేస్తామన్నారు. నిజాయితీ గల అధికారులను ఏటా సన్మానిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, ఎల్బీ కాలేజీ ఎన్సీసీ ఆఫీసర్ల ముండ్రాతి సదానందం, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్, జ్వాలా సంస్థ ప్రతినిధులు బుర్రి కృష్ణమూర్తి, పొట్లవపల్లి వీరభద్రరావు, కామిడి సతీశ్ రెడ్డి, బుద్దే సురేశ్, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
