జయశంకర్భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి మున్సిపాలటీ పరిధిలో రూ.10 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5 ఇంక్లైన్ కమాన్ దగ్గర రూ.7 కోట్ల కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ భవనం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
పెద్దకుంటపల్లిలో రూ. 2 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జంగేడులో రూ.50 లక్షలతో వైకుంఠధామం, రాంనగర్ కాలనీలో రూ.50 లక్షలతో బొగ్గు లోడింగ్, ఆన్ లోడింగ్ కార్మికుల యూనియన్ సంక్షేమ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ భవనం వంటి ప్రజా ఉపయోగకరమైన నిర్మాణాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో కాలనీల్లో పారిశుధ్యం మెరుగుపడుతుందని చెప్పారు. వైకుంఠధామం నిర్మాణంతో అంత్యక్రియల సమయంలో కుటుంబాలకు సౌకర్యం కలుగుతుందని వివరించారు.
కార్మికుల యూనియన్ సంక్షేమ భవనం ద్వారా వారి సమస్యలకు పరిష్కార వేదిక ఏర్పడుతుందన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, నాయకులు ముంజాల రవీందర్, దేవన్, రాజేందర్, కిషన్ పాల్గొన్నారు.
