రెండో రోజూ ఇండ్లల్లనే.. మెనే కాల్పుల ఘటనతో భయాందోళనలో జనం

రెండో రోజూ ఇండ్లల్లనే.. మెనే కాల్పుల ఘటనతో భయాందోళనలో జనం
  • నర హంతకుడి కోసం 
  • కొనసాగుతున్న పోలీసుల వేట

లెవిస్టన్(అమెరికా): మెనే రాష్ట్రంలోని లెవిన్ స్టన్ లో 22 మందిని కాల్చి చంపిన నరహంతకుడు రాబర్ట్ కార్డ్ ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. రాబర్ట్​ను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కౌంటీ పోలీసులతోపాటు ఎఫ్​బీఐ ఏజెంట్లు ఈ తనిఖీలలో పాల్గొంటున్నారు. హంతకుడు ఇంకా పట్టుబడకపోవడంతో లెవిన్ స్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం భయాందోళనల మధ్య గడుపుతున్నారు. 

ఘటనా స్థలానికి చుట్టూ దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని ఇండ్లు, దుకాణాలు, స్కూళ్లు, ఆఫీసులు సహా దాదాపుగా అన్నీ రెండో రోజు కూడా మూతపడ్డాయి. జనం కూడా భయంతో ఇంట్లో నుంచి బయటకు రావడంలేదు. రాత్రిపూట వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కాగా, కాల్పులు జరిపి పారిపోయిన రాబర్ట్ కార్డ్ కోసం పోలీసులు అతడి బంధువుల ఇండ్లల్లోనూ వెతుకుతున్నారు. గురువారం బౌడన్ విలేజ్ లోని రాబర్ట్ బంధువుల ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చుట్టుపక్కల ఉన్న ఇండ్లల్లోనూ వెతికారు. అయితే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించలేదు.