
నర్సాపూర్, వెలుగు: పనులు కంప్లీట్ చేసి ఏళ్లు గడుస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామని సర్పంచులు వాపోయారు. సోమవారం ఇన్ చార్జి ఎంపీపీ వెంకట నరసింగరావు అధ్యక్షతన నర్సాపూర్ మండల జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా.. జడ్పీ సీఈవో శైలేష్ కుమార్ పాల్గొన్నారు. సర్పంచులు మాట్లాడుతూ సమ్మర్లో ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీటిని సప్లై చేసిన బిల్లులు, ఈజీఎస్ ఆడిటింగ్ అమౌంట్, పల్లె ప్రకృతి వనం, క్రీడా మైదానాల బిల్లులు ఎప్పుడిస్తారని ఆఫీసర్లను ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులతో తమను భయపెట్టి ఆగమేఘాల మీద పనులు చేయించిన అధికారులకు టైమ్ కు బిల్లులు ఇవ్వాలని తెలియదా..? అని నిలదీశారు. కనీసం కార్మికుల జీతాలు, ట్రాక్టర్ డీజిల్ , షానిటేషన్ కు కూడా డబ్బులు లేవని, సూసైడ్ చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు ఏఈ ఎప్పుడూ సభకు రాడని సభ్యులు సీఈవో దృష్టికి తీసుకెళ్లగా.. మెమో ఇష్యూ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎఫ్ఆర్వో అంబర్ సింగ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.