మల్లారెడ్డి వర్సిటీ ముందు  విద్యార్థి సంఘాల ఆందోళన

మల్లారెడ్డి వర్సిటీ ముందు  విద్యార్థి సంఘాల ఆందోళన
  • నేతలపై దాడి చేసిన సిబ్బందిపైచర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్   

జీడిమెట్ల, వెలుగు: మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్​మెంట్ తీరును నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ నేతలు గురువారం ఆందోళనకు దిగారు. వర్సిటీ హాస్టల్​లో బుధవారం రాత్రి భోజనంలో బొద్దింక, బల్లి పడి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఇది విద్యార్థి సంఘాలకు తెలియడంతో గురువారం ఉదయం అక్కడికి చేరుకుని నిరసన తెలపడంతో వర్సిటీ సిబ్బంది వారిపై దాడిచేశారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి సంఘాల నేతలు పేట్​బషీరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న మల్లారెడ్డి  వర్సిటీ యాజమాన్యం నాణ్యమైన విద్య, భోజనం అందించకుండా విద్యార్థులను వేధిస్తుందని ఆరోపించారు.  భోజనం సరిగా లేక స్టూడెంట్లు అస్వస్థతకు గురైనది పొక్కకుండా దాస్తుందని మండిపడ్డారు. విద్యార్థులు ఉదయం బయటకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వర్సిటీ మేనేజ్ మెంట్ పై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.