అల్లాదుర్గం రెవెన్యూ డివిజన్ కోసం..ఆందోళనల బాట!

అల్లాదుర్గం రెవెన్యూ డివిజన్ కోసం..ఆందోళనల బాట!
  •      26 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు 
  •       రాస్తారోకో, మానవహారం చేపట్టి నిరసన 
  •      దీక్షలకు పలువురి నేతల మద్దతు 

మెదక్​ (అల్లాదుర్గం), వెలుగు : మెదక్​ జిల్లాలో మరో రెవెన్యూ డివిజన్ కోసం ఆందోళన కొనసాగుతోంది.  ఇదివరకు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. రెండు విడతల్లో దాదాపు ఆరునెలల పాటు ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రామాయంపేట  కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. కాగా అల్లాదుర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయాలనే డిమాండ్​తో ఆ ప్రాంత వాసులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. 

60 కిలో మీటర్లు దూర భారం

మెదక్  రెవెన్యూ డివిజన్​ పరిధిలోని రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలను కలిపి అల్లాదుర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ జాయింట్​ యాక్షన్​ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో గత  26 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా రాస్తారోకో, మానవహారం చేపట్టారు. వివిధ పనుల నిమిత్తం డివిజన్ కేంద్రానికి వెళ్లాలంటే 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. సరైన బస్సు సౌకర్యం లేకపోడవం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read : మీసాలు, తొడకొట్టటాలు సినిమాలో చూపించుకో.. దమ్ముంటే రా బాలయ్య : సభలో అంబటి సవాల్

ఈ క్రమంలో అల్లాదుర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్​చేయాల్సిందేనని స్థానికులు పట్టుపడుతున్నారు. రిలే దీక్షలకు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబు మోహన్, ఉమ్మడి మెదక్​ జిల్లా పరిషత్​ మాజీ చైర్మన్​ బాలయ్యతోపాటు పలువురు నేతులు మద్దతు తెలుపుతున్నారు. 

కొత్త మండలాల కోసం.. 

ఓ వైపు అల్లాదుర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయాలంటూ ఆందోళన కొనసాగుతుండగా, మరో వైపు పలు కొత్త మండలాల డిమాండ్​ వినిపిస్తోంది. రామాయంపేట మండలంలోని డి.ధర్మారం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని దీక్షలు చేపట్టారు. అలాగే కొల్చారం మండలం రంగంపేట కేంద్రంగా కూడా కొత్త మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ విషయమై గతంలో ఆందోళనలు కూడా కొనసాగాయి. ఎన్నికల నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఆయా ప్రాంత వాసులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. 

డివిజన్​సాధించే వరకు ఉద్యమం ఆగదు

ప్రభుత్వం మెదక్ డివిజన్​ కేంద్రానికి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలాలను కలిపి రామాయంపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్​ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాగా ఇదే డివిజన్​ పరిధిలో 50  నుంచి  60 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నమండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ ఎందుకు ఏర్పాటు చేయరు? అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్​, రేగోడ్​ మండలాలను కలిపి డివిజన్​ ఏర్పాటు చేయాలనే డిమాండ్​ న్యాయమైంది. మా డిమాండ్​ నెరవేరే వరకూ ఉద్యమం ఆగదు. 

-  బ్రహ్మం, జేఏసీ నాయకులు, అల్లాదుర్గం