- మార్కెటింగ్ శాఖ సూచన
హైదరాబాద్, వెలుగు: పసుపు కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నాణ్యమైన ఉత్పత్తితో మార్కెట్‌కు రావాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచించింది. సరైన పద్ధతులు పాటిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పసుపును ఉడికించిన అనంతరం కనీసం 15 రోజుల పాటు బాగా ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డులకు తీసుకురావాలని సూచించారు.
పసుపులో తేమ శాతం 12 శాతం లోపు ఉంటే మంచి ధర దక్కే అవకాశముందని పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయాన్ని పూర్తిగా నిషేధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి రైతులు పూర్తిగా ఎండబెట్టిన పసుపును మాత్రమే అమ్మకానికి తీసుకురావాలని కోరారు. మార్కెట్‌కు రాకముందే పసుపును శుభ్రపరిచి, కాడి, గోల, చూర వంటి మలినాలను వేరుచేసి తీసుకొస్తే నాణ్యత పెరిగి ధరలు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
