వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.. టీఎస్ సీడ్స్ బ్రాండ్ లోగో ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ విత్తన మార్కెట్ లో పోటీని తట్టుకునేలా నాణ్యమైన విత్తనాలను పండిద్దామని, విత్తన పంటలకు తెలంగాణ బ్రాండ్ కావాలని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విత్తన రైతుల 4వ వార్షిక సదస్సుకు హాజరైన మంత్రి.. టీఎస్ సీడ్స్ బ్రాండ్ లోగో ఆవిష్కరించి, విత్తన రథాన్ని ప్రారంభించారు. తర్వాత మాట్లాడుతూ.. తానూ విత్తన రైతునేనని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని విత్తనోత్పత్తి చేపడితే అధిక ఆదాయం వస్తుందన్నారు.
మన విత్తనాలకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉందని, విదేశాలకు ఎగుమతే లక్ష్యంగా విత్తనోత్పత్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో గోడౌన్లు, విత్తనశుద్ధి కర్మాగారాల సామర్థ్యం దశలవారీగా పెంచుతామన్నారు. ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో దాన్ని సాగు చేసేలా పంట కాలనీలను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

