వానాకాలం సీజన్‌‌ నుంచి పంటల బీమా

వానాకాలం సీజన్‌‌ నుంచి పంటల బీమా
  •     టెండర్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
  •     రైతుభరోసా విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోయే పరిస్థితి రాకుండా పంటల బీమా అమలుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు వెల్లడించారు. సోమవారం పంటల బీమా 2024 అమలుపై వ్యవసాయ శాఖ అధికారుల ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు. ఎన్నికల సంఘం అనుమతితో వచ్చే వానాకాలం సీజన్‌‌ నుంచి అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఏ ఒక్కరైతు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.

బ్యాంకులు, సహకార సంఘాలు పంట రుణాల రికవరీ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం, సంబంధిత అధికారులతో చర్చించి రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అప్పటి వరకు రైతులను రికవరీ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం అమలుకు విధివిధానాలపై కసరత్తు జరుగుతోందన్నారు. వచ్చే సీజన్‌‌ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందరికీ అమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి అర్హులందరికీ రైతు భరోసా అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా అన్ని రకాల పంటల కొనుగోళ్లు

మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా పంటల కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల పంటల కొనుగోళ్లు ప్రారంభించిందని తెలిపారు. మార్క్‌‌ఫెడ్ ద్వారా పొద్దుతిరుగుడు, శనగ, కంది, మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు జరుగుతోందన్నారు. మార్కెట్ యార్డులకు నిబంధనల ప్రకారం తీసుకువచ్చే ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే సీజన్‌‌కు సంబంధించి అన్ని రకాల పంటలకు అవసరమైన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

5 లక్షల టన్నుల ఎరువుల బఫర్‌‌ స్టాక్‌‌ జూన్‌‌ వరకు  మార్క్‌‌ ఫెడ్ వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారును సూచించినట్లు చెప్పారు. ఇప్పటికే నాలుగున్నర లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మార్చి నెలలో కురిసిన వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టం ఎన్యుమరేషన్ పూర్తయిందని చెప్పారు. ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ప్రభుత్వం పంట నష్ట పరిహారం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అనుమతులు కోరామని, అవి రాగానే, రైతులకు సబ్సిడీపై సీడ్స్‌‌ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు.