- క్వింటాలుకు అదనంగా రూ. 500: మంత్రి తుమ్మల సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే రైతు భరోసా
- సాగులో ఉన్న భూములకే వర్తింపు
- ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలూ అమలు చేస్తాం
- వచ్చే సీజన్ నుంచి అన్ని పంటలకూ బీమా.. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది
- మీడియా సమావేశంలో వ్యవసాయ మంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ను అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పంటలు సాగవుతున్న భూములకే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే రైతు భరోసా కింద ఎకరానికి రూ.7,500 చొప్పున అందజేస్తామని వెల్లడించారు. శనివారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఎన్.కోదండరెడ్డితో కలిసి మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే పంటలను కొనుగోలు చేస్తున్నామని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కోటా కొనుగోలు చేయడంలేదన్నారు. వంద శాతం అన్ని పంటలనూ కొనాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను పెంచి, పంట ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం కల్పిస్తామన్నారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదిక వచ్చాక కేబినెట్ లో చర్చించి అమలు చేస్తామన్నారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంటలు సాగు చేయని, బంజరు భూములకు కూడా రైతు బంధును అమలు చేసింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు బంధు ఇవ్వడం ద్వారా దాదాపు రూ.25 వేల కోట్లు వృథా అయ్యాయి. అందుకే పంటలు వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది” అని తుమ్మల తెలిపారు.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ
దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతురుణ మాఫీ చేయలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఒకేసారి ఏకంగా రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. ఒకే దఫాలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పారు. ‘‘రాష్ట్రంలోని 42 బ్యాంకుల్లో మొత్తం 25 లక్షల రైతు కుటుంబాలకు(42 లక్షల ఖాతాలు) 2018 నుంచి ఉన్న రూ. 31 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించాం. రూ. 2 లక్షలలోపు రుణాల మాఫీ కోసం పంద్రాగస్టు రోజున రూ. 18 వేల కోట్లు రిలీజ్ చేశాం.
నియోజకవర్గాల వారీగా రుణమాఫీ వివరాలను ఎమ్మెల్యేలందరికీ పంపించాం. టెక్నికల్ సమస్యలు ఉన్న, రేషన్ కార్డు లేని దాదాపు 3 లక్షల కుటుంబాల వివరాలను అధికారులు ఇంటింటి సర్వేతో గుర్తించారు. వీరందరికీ డిసెంబర్ లోగా రూ. 2 లక్షలలోపు రుణమాఫీ చేస్తాం. ఇందుకోసం మరో రూ. 2,500 కోట్లు రిలీజ్ చేస్తాం. రూ. 2 లక్షలకు మించి రుణాలు ఉన్న రైతులను కూడా రుణ విముక్తులను చేయడానికి కేబినెట్ లో చర్చించి, షెడ్యూల్ ప్రకటిస్తాం” అని మంత్రి వివరించారు.
మిల్లెట్స్‌ను ప్రోత్సహించాలి
చిరుధాన్యాలకు దేశంతోపాటు తెలంగాణలో గొప్ప చరిత్ర ఉన్నదని మంత్రి తెలిపారు. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాలను మన పూర్వీకులు వినియోగించేవారన్నారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన అంతర్జాతీయ పోషక చిరుధాన్యాల సమ్మేళనం (ఇంటర్నేషనల్ న్యూట్రిసెరిల్ కన్వెన్షన్) లో మంత్రి తుమ్మల పాల్గొని, ప్రసంగించారు. చిరుధాన్యాలను జీవనశైలిలో భాగం చేసుకుంటే మంచిదన్నారు. మిల్లెట్స్ వాడకాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.
వచ్చే సీజన్ నుంచి పంటల బీమా
గత ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయలేదని, తమ ప్రభుత్వం మాత్రం త్వరలో ప్రతి పంటకూ బీమా పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి తుమ్మల చెప్పారు. పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ పథకం కోసం త్వరలోనే ఇన్సూరెన్స్ కంపెనీలను టెండర్లకు పిలుస్తామన్నారు. రైతులకు మెరుగైన ప్యాకేజీని ఎంపిక చేస్తామన్నారు. రాబోయే యాసంగి నుంచి మూడు సీజన్లకు టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న గత యాసంగి రైతు బంధు డబ్బులు రూ. 7,666 కోట్లను తమ ప్రభుత్వం రైతులకు చెల్లించిందన్నారు. అలాగే పచ్చి రోట్ట విత్తనాలు, పామ్ ఆయిల్, డ్రిప్ సబ్సిడీలు.. ఇలా దాదాపు రూ. 8,000 కోట్ల పెండింగ్ నిధులను తమ సర్కారు విడుదల చేసిందన్నారు.
దేశంలో రైతులకు రూ.50 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త శకం మొదలైందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు లబ్ధి కలిగించే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. మెరుగైన అంశాలతో రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.