- 1,24,545 మంది రైతుల ఆధార్ వివరాల్లో మిస్టేక్స్: మంత్రి తుమ్మల
- ఇప్పటికే 41,322 ఖాతాల డేటా సరి చేశాం
- ఇంకా కుటుంబ నిర్ధారణ కాని ఖాతాలు 4,24,873
- రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతులకు దశలవారీగా రుణమాఫీ చేస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రైతుల ఆధార్ డేటాలో తప్పులను సవరిస్తూ రుణమాఫీలో సమస్యలను పరిష్కరిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా1,24,545 మంది రైతుల అకౌంట్లలో ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 41,322 మంది ఖాతాలను సరి చేశామని తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి అగ్రిలక్చర్, కో-ఆపరేటివ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రుణమాఫీలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను పరిష్కరించే దిశగా చేపట్టిన చర్యల గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కుటుంబ నిర్ధారణ కాని రైతుల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా అప్లోడ్ చేసి పరిష్కరిస్తున్నామని తెలిపారు. రూ.2 లక్షలలోపు పంట రుణాలు ఉండి, కుటుంబ నిర్ధారణ కాని 4,24,873 మంది రైతుల వివరాలను ఈ యాప్ ద్వారా సేకరిస్తున్నామన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు స్వయంగా రైతుల ఇంటికి వెళ్లి వివరాలు తీసుకుంటున్నారని చెప్పారు. రైతు వేదికలు, మండల అగ్రికల్చర్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసిన నగదును రైతుల లోన్ అకౌంట్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెన్యువల్ అయిన ఖాతాలకు సొమ్మును తిరిగి చెల్లించాలని, మాఫీ అయిన ఖాతాలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లను మాఫీ చేయగా, రూ.1,0,400 కోట్లు రైతులకు బ్యాంకులు మళ్లీ ఈసీజన్లో క్రాప్లోన్లు ఇచ్చాయని తెలిపారు. మిగిలిన రైతులకూ కొత్త లోన్లు మంజూరు చేయాలని కోఆపరేటివ్ సొసైటీలు, బ్యాంకులను మంత్రి కోరారు.
రూ.2 లక్షలు దాటినోళ్లకు దశలవారీగా..
రూ.2 లక్షలకు పైగా క్రాప్‌లోన్ లు ఉన్న రైతులకు త్వరలోనే దశలవారీగా రుణమాఫీని వర్తింపచేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. టెక్నికల్ సమస్యలతో, కుటుంబ నిర్ధారణ కాని కారణంగా రుణమాఫీ జరగని రైతులు ఏఈవో, ఏవో స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆఫీసర్లు ఇంటికి వచ్చినప్పుడు వారు అడిగిన వివరాలు ఇవ్వాలని చెప్పారు.
కుటుంబ నిర్ధారణకు అవసరమైన వివరాలు సేకరించడంతో పాటు, బ్యాంకర్లు తప్పుగా నమోదుచేసిన వివరాలను వెంటనే సరి చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ, సహకార శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.