ఇంటి నుంచే పొలం పనులు చూసుకునేందుకు మొబైల్ యాప్​

ఇంటి నుంచే పొలం పనులు చూసుకునేందుకు మొబైల్ యాప్​
  • ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో ‘ఆగ్ స్పీక్’ యాప్ తయారు చేసిన అస్సాం స్టూడెంట్స్
  • ఈశాన్య రాష్ట్రాల్లో వాడకం ప్రారంభించిన రైతులు
  • త్వరలో దేశమంతా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్

ఇంటి నుంచే పొలాలను చూసుకునే ఫెసిలిటీ ఉంటే ఎలా ఉంటుంది? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? సాధ్యం చేసి చూపించేందుకు ఒక  యాప్​ తయారుచేశారు అస్సాం స్టూడెంట్స్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌తో వివిధ భాషల్లో ‘అగ్‌‌స్పీక్’ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌‌ను డెవలప్ చేశారు.

అస్సాంలోని గౌహతి ఐఐటి, సిల్చర్ ఎన్‌‌ఐటి, దిబ్రుగఢ్​ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ ‘అగ్ స్పీక్’ యాప్‌‌ను క్రియేట్ చేశారు. రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ యాప్ సాయపడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను ఆప్టిమైజ్ చేసే లక్ష్యంతో దీన్ని డెవలప్ చేశారు. ఇది ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల రైతులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ముందు ముందు దేశవ్యాప్తంగా ఈ యాప్‌‌ను అందుబాటులోకి తెచ్చేందుకు స్టూడెంట్స్  ప్లాన్ చేస్తున్నారు.

క్రాప్ డేటాను సేకరించే పనిలో..

ప్రస్తుతం దాదాపు ఇరవై లోకల్‌‌ పంటల వివరాలను ఆగ్‌‌స్పీక్‌‌లో పొందుపరిచారు. దాంతోపాటు వర్షపాతం, ఎండ స్థితిగతులు, నేల ఎలా ఉంది?  లాంటి వివరాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి వివరిస్తుంది. రైతులు ఒక సారి ఈ యాప్ డౌన్‌‌లోడ్ చేసుకుంటే వారికి డైలీ అలెర్ట్ మెసేజ్‌‌లు వస్తుంటాయి. ఏదైనా పంటకు నష్టం జరిగే అవకాశం ఉంటే ముందే రైతులను అలెర్ట్ చేస్తుంది. ఇలా ముందే అలెర్ట్‌‌గా ఉంటూ.. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటే రైతులు ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్‌‌ను పెంచడానికి వీలుంటుందంటారు స్టూడెంట్స్.

ప్రాక్టికల్‌‌గా వివరిస్తూ

అస్సాంలో ఎక్కువగా రైతులు తేయాకునే పండిస్తారు. అయితే, ప్రతి సంవత్సరం దోమలు, పురుగుల బెడదతో లక్షల్లో పంట నష్టాన్ని చూస్తుంటారు. దీని నుంచి రైతులను బయటపడేయాలనే ఉద్దేశంతో ముందు వాటిపై దృష్టిపెట్టారు. మూడు నెలలుగా దాదాపు ఐదు వందల మంది రైతులకు ఈ యాప్ గురించి వివరించారు. రెండు టీ ఎస్టేట్‌‌లో ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్స్ చేసి చూపించారు. ఆలుగడ్డ, టీ పంటలపై దోమలు, పురుగులు ఏయే టైంలో దాడులు చేస్తున్నాయి? వింటర్ సీజన్‌‌లో పంటలపై తేమ ఒత్తిడి ఎలా ఉంటుంది? లాంటి వాటిపై కూడా ప్రాక్టికల్‌‌గా రైతులకు వివరించారు.

లోకల్ లాంగ్వేజ్‌‌లో..

యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ప్రతీ రైతుకూ తమ పంట గురించి వివరిస్తుంది ఈ యాప్. అందుకే ఈ యాప్ ఈజీగా అర్థమయ్యేందుకు అస్సాం భాషతో పాటు మరికొన్ని ఈశాన్య ప్రాంత భాషల్లో క్రియేట్ చేశారు. రైతులకు అగ్రిటెక్ అప్లికేషన్లతో పాటుగా అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌‌ను పూర్తిగా ఉపయోగించుకునేందుకు ఇప్పటివరకూ దాదాపు రెండు వందల యాభై మంది రైతులకు ట్రైనింగ్ ఇచ్చారు. సాధారణంగా ఎక్కువమంది రైతులు చదువురానివాళ్లే ఉంటారు. కాబట్టి, రైతులకు అర్థమయ్యేలా ఈ యాప్ లో వివరాలు పొందుపరిచారు. ట్రైనింగ్ కూడా వాళ్లకోసం ఈజీ మెథడ్ చేశారు. తక్కువ టైంలో ట్రైనింగ్‌‌ ఇవ్వడం, సన్నకారు రైతులకు ఫ్రీగా యాప్ ను అందివ్వడం కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా పంటను ఈజీగా మేనేజ్ చేసుకునేందుకు ఐవోటీ పరికరాలను కూడా అద్దెకు ఇస్తున్నారు.

అందరికీ ఫుడ్ అందాలనే లక్ష్యంతో

మన దేశంలో వ్యవసాయం కోసం అపారమైన వనరులున్నాయి. అయినప్పటికీ ప్రతీ ఏటా కోట్లమందికి తగినంత ఫుడ్ అందడం లేదు. అందుకే ఈ సమస్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అగ్‌‌స్పీక్ యాప్ తయారు చేశామంటున్నారు గౌహతి ఐఐటి స్టూడెంట్స్. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ చాలా అవసరం. సరైన టెక్నాలజీని ఉపయోగించి రైతులకు శ్రమ తగ్గిస్తే ఎక్కువ మొత్తంలో ప్రొడక్ట్ విడుదలవుతుందని చెప్తున్నారు. ఈ యాప్ ద్వారా వచ్చే పదిహేనేళ్లలో వ్యవసాయ ప్రొడక్టివిటీని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లున్నాం అంటున్నారు అస్సాం స్టూడెంట్స్.