ఆర్టికల్ 370పై కాంగ్రెస్ తన వైఖరిని చెప్పాలి

ఆర్టికల్ 370పై కాంగ్రెస్ తన వైఖరిని చెప్పాలి

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడమే గుప్కర్ కూటమి ఎజెండా అని చెప్పారు. ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ తీరుపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా కామెంట్ చేశారు. ‘పాకిస్తాన్‌‌తోపాటు భారత వ్యతిరేక దేశాలు ఏం కోరుకుంటున్నాయో అదే గుప్కర్ కూటమి కావాలనుకుంటోంది. ఆర్టికల్ 370 తొలగింపు అంశాన్ని ప్రతి ఫోరమ్‌‌లోనూ పాకిస్తాన్ లేవనెత్తింది. గుప్కర్ అలయెన్స్ కూడా అలాంటి అంశమే. గుప్కర్ కూటమిపై తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను సోనియాజీ, రాహుల్‌‌జీ సమర్థిస్తారా?’ అని సంబిత్ పాత్రా చెప్పారు.

‘ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం చైనా సాయం కోరతామని ఫరూక్ అబ్దుల్లా అంటున్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే దాకా జమ్మూ కశ్మీర్‌‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోమని మెహబూబా ముఫ్తీ చెబుతున్నారు. వీరిని నేనొక్కటే అడుగుతున్నా.. ఈ దేశ చట్టాలు జమ్మూ కశ్మీర్‌‌లో అమలు కావొద్దా? చట్టాలను అమలు కాకుండా చేయడం ద్వారా ఇంకా అవినీతిని కొనసాగించేందుకు కుట్ర పన్నుతున్నారా? ఇలాంటి నేతలు, పార్టీలతో గుప్కర్ కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో కాంగ్రెస్ చేరింది. ప్రజాస్వామ్యాంలో ఏ పార్టీ అయినా ఇతర పార్టీలతో కలసి ముందుకెళ్లే స్వేచ్ఛ ఉంది. దీని గురించి మేం ప్రశ్నించడం లేదు. కానీ ఆ కూటమి ఎజెండాను మేం ప్రశ్నిస్తున్నాం. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై తమ వైఖరిని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పష్టం చేయాలి’ అని రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.