Pakistan: పాక్ క్రికెట్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన, అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 2–-1తో ఓటమి చవిచూడటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ సీనియర్ బ్యాటర్ అహ్మద్ షెహ్‌జాద్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. పీసీబీతో పాటు కీలక ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నక్వీ నిర్ణయాలను పరోక్షంగా తప్పుపడుతూ, బోర్డుకు అద్దం చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. గత 7 ఏళ్లుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ద్వారా నిర్మించిన బ్రాండ్ వాల్యూకు, ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల స్థాయికి అస్సలు పొంతన లేదని షెహ్‌జాద్ పేర్కొన్నారు.
ప్రస్తుత జట్టులోని 6 నుంచి 8 మంది ఆటగాళ్లే PSLలో కీలక పాత్ర పోషిస్తున్నారు.. వారే దేశీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. కానీ, పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తును మార్చే సత్తా అసలు వారికి ఉందా? అని షెహ్‌జాద్ ప్రశ్నించారు. ప్లేయర్స్ ని పాక్ క్రికెట్ బోర్డు గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఆటగాళ్లకు భారీగా స్పాన్సర్‌షిప్‌లు, కెప్టెన్సీ పదవులు కట్టబెట్టినప్పటికీ, వారు దేశం కోసం సాధించింది శూన్యం అన్నారు. వాళ్లు కేవలం పార్టీలు చేసుకోవడం, జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. మైదానంలో గెలవాలనే కసి ఏ ఒక్కరిలో కనిపించడం లేదన్నారు. ఓటమి ఎదురైనప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది పోయి, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మన (పాకిస్తాన్) ఆటగాళ్లకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
►ALSO READ | Sanju Samson: సంజుతో ఎవరిని పోల్చలేం.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వైఫల్యాలు చెందుతున్న ఆటగాళ్లనే పదే పదే కొనసాగించడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరింత బలహీనపడిందని షెహ్‌జాద్ అభిప్రాయపడ్డారు. కాగా 2014 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ చేసి, పాకిస్తాన్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా షెహ్‌జాద్ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం షెహ్‌జాద్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. పక్షపాత ధోరణి వీడి, జట్టులో సమూల మార్పులు చేయకపోతే పాకిస్తాన్ క్రికెట్ మరింత పతనం కావడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
