గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్–2030 నిర్వహణ హక్కులు ఇండియాకు దక్కాయి. నెల రోజుల కిందటే ఖాయమైనప్పటికీ.. బుధవారం గ్లాస్గోలో సమావేశమైన కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీ ఆతిథ్య హక్కులను అధికారికంగా కేటాయించింది. మొత్తం 74 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ దీనికి ఆమోద ముద్ర వేసింది. దాంతో రెండు దశాబ్దాల తర్వాత ఇండియాలో బహుళ క్రీడా ఈవెంట్ జరగనుంది. 2010లో చివరిసారి ఢిల్లీ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించారు. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని ఇండియా కోరుకుంటున్న తరుణంలో సీడబ్ల్యూజీ హక్కులు దక్కడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. 2030 బిడ్ కోసం అబుజా (నైజీరియా) నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురైంది.
‘ఇండియాలోని యువత మంచి ఆశయం, గొప్ప సంస్కృతి, అపారమైన క్రీడా అభిరుచి కలిగి ఉన్నారు. మేం కామన్వెల్త్ గేమ్స్ కోసం మా తదుపరి శతాబ్దాన్ని మంచి ఆరోగ్యంతో ప్రారంభిస్తాం’ అని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ డొనాల్డ్ రుకరే అన్నారు. కామన్వెల్త్ చూపిన నమ్మకం తమకు ఎంతో గౌరవాన్నిచ్చిందని ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష పేర్కొన్నారు. 2030 క్రీడల్లో 15 నుంచి 17 క్రీడాంశాలు ఉంటాయి. అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పారా టీటీ, బౌల్స్, పారా బౌల్స్, వెయిట్ లిఫ్టింగ్, పారా పవర్ లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్‌బాల్, బాక్సింగ్ ఉండనున్నాయి. మిగతా క్రీడాంశాలను వచ్చే నెలలో ఖరారు చేయనున్నారు. ఆర్చరీ, బ్యాడ్మింటన్, 3x3 బాస్కెట్‌బాల్ మరియు 3x3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, టీ20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, హాకీ, జూడో, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రగ్బీ సెవెన్స్, షూటింగ్, స్క్వాష్, ట్రయాథ్లాన్ మరియు పారా ట్రయాథ్లాన్ మరియు రెజ్లింగ్ పరిశీలనలో ఉన్నాయి.
