
రోజురోజుకూ కొత్త ఏఐ ఆవిష్కరణలు, ఏఐ అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. అయితే ఈ సాంకేతికత కొన్ని అనుకోని ముప్పులను కూడా తెచ్చిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. "ఏఐ గాడ్ఫాదర్"గా పేరుగాంచిన గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్, నోబెల్ పురస్కారం అందుకున్న కంప్యూటర్ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ ఏఐ అభివృద్ధి అంశంపై తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో AI మనుషులకంటే చాలా తెలివిగా మారి, మానవ జాతికి ముప్పు కలిగించవచ్చని లాస్‌వెగాస్ లో జరిగిన Ai4 ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ హెచ్చరించారు జెఫ్రీ హింటన్.
సుమారు 10 నుంచి 20 శాతం వరకు మనుషుల ఉద్యోగ అవకాశాలు పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు హింటన్ . AI వ్యవస్థలు ఒక దశలో అధిక శక్తివంతం అవగానే.., అవి మనుషుల నియంత్రణలో ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు హింటన్. ఈ పరిస్థితిని వివరించడానికి చిన్న ఉదాహరణ ఇస్తూ.. పెద్దవాళ్లు పిల్లలను బుజ్జగించటానికి ఏదైనా తినటానికి ఇచ్చి తమ మాట వినేలా చేసినంత సులభంగా భవిష్యత్తులో AI కూడా మనుషులను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.
►ALSO READ | IPO News: తొలిరోజే రూ.100 పెట్టుబడికి రూ.40 లాభం.. దుమ్ముదులిపిన ఐపీవో..
ప్రస్తుతం టెక్ కంపెనీలు AIపై సరైన నియంత్రణ సాధించగలవా అనే ప్రశ్నలపై హింటన్ సందేహం వ్యక్తం చేశారు. లాభాల కోసం మాత్రమే కాకుండా మానవుల భద్రత కోసమే సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. AI మోడళ్లలో "మాతృస్వభావం"ని చేర్చాలని సూచించారు. అలా చేయటం వల్ల మనుషుల కంటే ఎక్కువ శక్తివంతంగా మారినప్పటికీ.. AI వ్యవస్థలు మానవుల పట్ల శ్రద్ధ, మమకారం చూపే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు హింటన్.
మొత్తానికి ఏఐ నిపుణుడు హింటన్ మాటలు వింటుంటే భవిష్యత్తులో ఏఐ తీసుకొచ్చే అవకాశాలు, ప్రమాదాలు గురించి ప్రస్తుతం ప్రజల్లో పెద్ద ఆందోళనలు క్రియేట్ చేస్తున్నాయి. టెక్ అభివృద్ధి మనుషుల ప్రయోజనాల కోసం ఉపయోగపడాలంటే గట్టి నైతిక నియంత్రణ అవసరం అన్న సందేశాన్ని హింటన్ మాటల నుంచి అర్థం అవుతోంది. విచ్చలవిడి ఏఐ వినియోగం, అభివృద్ధి నిజంగానే పెద్ద ప్రమాదంగా మారొచ్చని ఆయన మాటల్లో తెలుస్తోంది.