ఢిల్లీ ఏఐ సమ్మిట్‌కి రెండున్నర లక్షల విజిటర్స్.. అదరగొడుతున్న చెన్నై స్టార్టప్స్..

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌కి రెండున్నర లక్షల విజిటర్స్.. అదరగొడుతున్న చెన్నై స్టార్టప్స్..

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 తొలిరోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్.. ఏఐ రంగంలో భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెబుతోంది. దాదాపు 70వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 10 భారీ అరేనాల్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోకు ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది.

రిజిస్ట్రేషన్లలో రికార్డ్.. 
ఈ సమ్మిట్ కోసం దేశవిదేశాల నుంచి ఏకంగా 2.5 లక్షల మంది ప్రతినిధులు రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ప్రభుత్వం ఊహించిన దానికంటే ఇది ఎంతో ఎక్కువని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. ఈ సదస్సులో మొత్తం 600 పైగా స్టార్టప్ కంపెనీలు, 300కు పైగా ఎగ్జిబిషన్ పవిలియన్లు కొలువుదీరాయి. అమెరికా, రష్యా, జపాన్ సహా 13 దేశాలు ప్రత్యేక పవిలియన్లను ఏర్పాటు చేశాయి. 500 సెషన్లలో దాదాపు 3వేల250 మంది నిపుణులు ప్రసంగించబోతున్నారు.

చెన్నై ఏఐ స్టార్టప్‌ల జోరు.. 
ఈ సమ్మిట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దక్షిణాది స్టార్టప్‌లే. ముఖ్యంగా చెన్నైకి చెందిన ఏఐ కంపెనీలు తమ వినూత్న ఆవిష్కరణలతో అదరగొడుతున్నాయి. చెన్నైకి చెందిన 'అత్సుయ టెక్నాలజీస్' తన AOne ప్లాట్‌ఫామ్‌తో గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌లో టాప్-20లో నిలిచింది. పారిశ్రామిక రంగంలో ఏఐ ఏజెంట్ల ద్వారా రియల్ టైమ్ నిర్ణయాలు తీసుకునే ఈ సాంకేతికతకు భారీ స్పందన లభిస్తోంది. అలాగే చెన్నైకే చెందిన వజ్ర గ్లోబల్, కోర్ స్టాక్, కిడౌరా ఇన్నోవేషన్స్ వంటి కంపెనీలు హెల్త్ కేర్, డేటా గవర్నెన్స్ రంగాల్లో తమ ఏఐ సత్తాను చాటుతున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన ఈ స్టార్టప్‌లు కేవలం భారత్ కోసమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించదగిన ప్రాక్టికల్ పరిష్కారాలను చూపిస్తున్నాయి.

భారతీయ భాషల వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమ్మిట్‌లో 12 స్వదేశీ ఫౌండేషన్ మోడల్స్‌ను ఆవిష్కరించారు. ఇవి భారత రాజ్యాంగం గుర్తించిన 22 అధికారిక భాషల్లో శిక్షణ పొందాయి. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు కూడా ఈ సదస్సులో పాల్గొననుండటం దీని ప్రాధాన్యతను పెంచుతోంది. వ్యవసాయం, విద్య, రక్షణ రంగాల్లో ఏఐ ఎలా ప్రాణప్రదంగా మారబోతుందో ఈ సమ్మిట్ వేదికగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు.