ఏఐ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ వైద్య రంగంలో దాని వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా వ్యాధిని గుర్తించడంలో దీని పాత్ర కీలకంగా మారుతోంది. డాక్టర్లు బ్రెయిన్ స్కాన్లను వేగంగా స్క్రీనింగ్ చేసేందుకు దీన్ని వాడుతున్నారు. అంతెందుకు రేడియాలజిస్టులు గుర్తించలేని గాయాలను కూడా ఏఐ గుర్తిస్తోంది. అయితే.. ఇప్పుడు పుణెకు చెందిన రేడియాలజీ ఏఐ స్టార్టప్ ‘డీప్‌టెక్’ ఛాతీ ఎక్స్‌రేని విశ్లేషించే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఎక్స్‌రేని పరిశీలించి టీబీతోపాటు మరో 20కి పైగా ఊపిరితిత్తుల సమస్యలను గుర్తించగలదు.
నిమిషాల్లోనే నాడ్యూల్స్, ఫ్రాక్చర్లు, పేస్‌మేకర్ లాంటి హార్డ్‌వేర్‌ను పసిగట్టగలదు. మన దేశంలో ప్రస్తుతం రేడియాలజీ రీసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో రోగ నిర్ధారణ చేసేందుకు డీప్‌టెక్ కీలకంగా మారనుంది. ఈ ఏఐ టెక్నాలజీని యూరోపియన్ యూనియన్ మెడికల్ డివైజ్ రెగ్యులేషన్ ఇప్పటికే ధృవీకరించింది. ఈ మధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని క్షయవ్యాధి పరీక్ష కోసం వాడే కంప్యూటర్ బేస్డ్ టూల్స్ జాబితాలో చేర్చింది. ప్రస్తుతం మన దేశంలోని 500 హాస్పిటల్స్, ఇమేజింగ్ సెంటర్లలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీనివల్ల చాలా వేగంగా రోగ నిర్ధారణ చేస్తుండడం వల్ల రోగులకు వెయిటింగ్ టైం తగ్గి వ్యాధి ప్రబలకుండా కాపాడుతుంది.
