అన్నాడీఎంకేలో తారాస్థాయికి చేరిన వివాదం

అన్నాడీఎంకేలో తారాస్థాయికి చేరిన వివాదం

తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ రాజకీయాలు రంజుగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకే ఏకనాయకత్వం కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. పార్టీని చేజిక్కించుకొనేందుకు సీనియర్ నేతలైన పళని స్వామి, పన్నీర్ సెల్వంలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో.. చెన్నైలోని శ్రీవారు వెంకట చలపతి ప్యాలెస్ లో కీలక భేటీ జరిగింది. అయితే.. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రులు, ముఖ్య నేతలు రెండుగా విడిపోయారు. పళనిస్వామి (ఈపీఎస్) క్యాంప్ కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు. ఓపీఎస్, ఈపీఎస్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు. దీంతో సమావేశం మధ్యలోనే పార్టీ సమన్వయకర్త పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్ చేశారు. ఈ సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆయనపైకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. భద్రతా సిబ్బంది అడ్డుగా నిలిచారు. బయటకు వచ్చిన తర్వాత.. ఆయన వెళ్లకుండా కార్లలో గాలి తీసేశారు. దీంతో వేరే కారులో వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నడుమ సమావేశం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసిపోయింది. జూలై 11న అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరుగనుంది. జూన్ 14న జిల్లా కార్యదర్శ సమావేశం జరిగినప్పటి నుంచి ఏక నాయకత్వం డిమాండ్ వినిపిస్తూ వచ్చింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా.. అవి ఫలించలేదు. గురువారం నాడు జరిగిన ఈ కీలక సమావేశంలో ఏక నాయకత్వానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదం తెలియచేయాలని అనుకున్నారు. కానీ.. సమావేశానికంటే ముందే పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు. తన సంతకం లేకుండా జనరల్ బాడీ తీర్మానం ఆమోదం పొందదంటూ కామెంట్స్ చేశారు. మరి జూలై 11వ తేదీన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.