పన్నీర్ సెల్వం పిటిషన్ ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

పన్నీర్ సెల్వం పిటిషన్ ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

అన్నా డీఎంకే పార్టీ పగ్గాలపై కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరపడింది.  జనరల్ కౌన్సిల్ సమావేశాలకు  అడ్డుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఎడప్పాడి పళని స్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. కోర్టు తీర్పు ఇచ్చిన కాసేపటికే జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి ఎన్నికయ్యారు. మీటింగ్ కు ముందే.. జయలలిత, ఎంజీఆర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు పళని స్వామి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి.. కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేశారు పళనిస్వామి. దీంతో పార్టీ నాయకత్వ పగ్గాలు ఎవరైనా ఒక్కరే చేపట్టే ఛాన్స్ ఉంటుంది. గతంలో పళని స్వామి, పన్నీర్ సెల్వం పార్టీ లీడర్ షిప్ పంచుకోగా.. కొత్త ప్రతిపాదనతో ఈ ట్రెడిషన్ కు తెరపడింది. మీటింగ్ లో 16 కీలక ప్రతిపాదనలు ఆమోదించనున్నట్లు తెలిపింది పళని స్వామి వర్గం.



చెన్నై రాయపేట లోని అన్నా డీఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల కార్యకర్తల మధ్య భారీగా ఘర్షణ జరిగింది. పళని స్వామికి స్వాగతం చెప్పేందుకు భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పళని స్వామి వస్తుండగా.. పన్నీర్ సెల్వానికి మద్దతిస్తున్న వారు నినాదాలు చేశారు. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నాయి. తమదే పార్టీ అంటే... తమదే పార్టీ అంటూ OPS, EPS వర్గాల కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. ఘర్షణ కాస్త ముదరటంతో...ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కోర్టు తీర్పురాకముందే ఇరు వర్గాల ప్రజలు ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరారు. డీఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

పళని స్వామికి మద్దతుగా తీర్పు రావడంతో.. OPS మద్దతు దారులు రచ్చ చేశారు.  EPS కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పార్టీ ఆఫీస్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. మీటింగ్ అడ్డుకునేందుకు పన్నీర్ సెల్వం మద్దతు దారులు ప్రయత్నించారు. పార్టీ ఆఫీస్ లోకి వెళ్లి కుర్చీలు విరగ్గొట్టి.. పన్నీర్ సెల్వం మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. మరికొందరు పళని స్వామి ఉన్న వాల్ పేపర్లను చించేశారు. మరోవైపు... మీటింగ్ ప్రాంతంలో, పార్టీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్తలు జరగకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అధికారులు.