తెలంగాణలో ఎన్ఆర్ఐ సెల్ సరిగా లేదు

తెలంగాణలో ఎన్ఆర్ఐ సెల్ సరిగా లేదు

గల్ఫ్ లో ఉన్నవాళ్లను ప్రభుత్వమే తీసుకురావాలి
వారికోసం రూ. 1000 కోట్లు కేటాయించాలి
సీఎం కేసీఆర్ కు AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ లేఖ

తెలంగాణలో ఎన్ఆర్ఐ సెల్ సరిగా లేదని AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ నుంచి దాదాపు 12 నుంచి 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఆయన అన్నారు. వారందరిని ప్రభుత్వమే తెలంగాణకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఉపాధి కోసం తెలంగాణ నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ప్రతి నెలా వారు గల్ఫ్ నుంచి సుమారు 1500 కోట్ల రూపాయలను ఫారెన్ ఎక్సచేంజ్ చేస్తుంటారు. తద్వారా మన తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ కూడా బలపడుతోంది. బయటి దేశాలలో ఉండి కూడా తెలంగాణ బలోపేతానికి గల్ఫ్ కార్మికులు పాటుబడుతున్నారు. కరోనాతో గల్ఫ్ దేశాల్లో ఆర్ధిక పరిస్థితులు మారిపోయాయి. అక్కడ ఆయిల్ ఎకానమీ పూర్తిగా పడిపోయింది. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి. దాంతో అక్కడ తెలంగాణ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ లో చిక్కుకున్న వాళ్లను తెలంగాణకు తీసుకొచ్చెందుకు రాష్ట్రం ప్రభుత్వమే విమాన ఖర్చులు పెట్టుకోవాలి. డబ్బులేక వలస వెళ్లిన వాళ్లను ప్రస్తుత పరిస్థితులలో విమాన ఖర్చులు పెట్టుకోమనడం సరికాదు. ఇప్పటికే ఆర్ధిక పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న కార్మికులు చార్జీలు ఎలా భరిస్తారు? తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి. గల్ఫ్ లో పని చేస్తున్న తమ దేశ కార్మికులను ఆయా దేశాలే అన్ని ఖర్చులు భరించి తమ దేశాలకు తీసుకొస్తున్నాయి. మరి అటువంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయదు? గల్ఫ్ కార్మికులు పడే ఇబ్బందులపై ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశాను. రూ. 1000 కోట్లు గల్ఫ్ కార్మికుల కోసం కేటాయించాలి. గల్ఫ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించాలి’ అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.

For More News..

మిల్లులో ధాన్యం కోత పెడితే మాకు చెప్పండి