
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా బలహీనవర్గాల సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సోషల్ జస్టిస్ 2.0’ కొత్త ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభు త్వం శాస్త్రీయంగా చేపట్టిన కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్ అని తెలిపారు. ఈ విప్లవాత్మక సామాజిక – ఆర్థిక సర్వే ఆధారంగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన కీలక బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయని గుర్తుచేశారు. గురువారం కులగణనపై ఇందిరా భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘దశాబ్దాలుగా విస్మరించబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం రాహుల్ నేతృత్వంలో పోరాటం చేస్తున్నాం. దేశ జనాభాలో ఈ వర్గాలదే సింహ భాగమైనా.. కీలకమైన కార్పొరేట్ బోర్డులు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, ప్రధాన సంస్థల్లో వీరికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఉదాహరణకు.. సెంట్రల్ వర్సిటీల్లో 80 శాతం ఓబీసీ, 83 శాతం ఎస్టీ ప్రొఫె సర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయని పార్లమెంట్ వేదికగానే కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది.
అందువల్ల దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి, 50% రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలనేది మా ప్రధాన డిమాండ్. ఈ దిశలో కాంగ్రెస్ పోరాటాలు, ప్రజా ఒత్తిడితో దేశ జనగణనలో కులగణనకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తలొగ్గింది. కులగణన సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతమైన చర్య. ఈ సర్వే సందర్భంగా కొన్ని వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురై ఉండవచ్చు” అని ఆయన అన్నారు. అలాగే, తెలంగాణలో కులగణన విజయవంతమవడంలో కీలక పాత్ర పోషించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.