
- దేశం కోసం మోదీ చేసిందేంది?.. కన్నీళ్లు కార్చడం తప్ప
- ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడ్తున్నడు
- సంపదనంతా అదానీ, అంబానీ చేతుల్లో పెట్టిండు
- అప్పులకు వడ్డీ కట్టలేక రైతులు చనిపోతున్నా పట్టించుకోలే
- మా మేనిఫెస్టో అంటే మోదీకి భయం
- రాష్ట్రంలో ఆర్ఆర్.. రేవంత్‌రెడ్డిని గెలిపించారు
- దేశంలో మరో ఆర్.. రాహుల్‌ను గెలిపించండి
- తాండూరు, కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రసంగం
హైదరాబాద్/కామారెడ్డి, వెలుగు : దేశ పౌరులు ఎట్టిపరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చనివ్వరని, వారు మోదీనే మారుస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘అవసరమైతే రాజ్యాంగం కోసం ప్రాణాలు కూడా అర్పిస్తారు. ఓట్ల కోసం మోదీ చెప్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రాజ్యాంగాన్ని రాసింది మోదీ కాదు. ఈ దేశ ప్రజలు. రాజ్యాంగ రూపకల్పన కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు.. ఎంతో శ్రమించారు.
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.. మోదీని గద్దె దించేద్దాం” అని పేర్కొన్నారు. ప్రజల్లో మోదీ విష బీజాలను నాటుతున్నారని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఈ కుయుక్తులను గమనించాలని, ఓటుతో తిప్పికొట్టాలని ఆమె అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల సభలకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ.. పదేండ్లలో దేశానికి గానీ, తెలంగాణకు గానీ మోదీ చేసింది ఏమిటని ప్రశ్నించారు. కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.
‘‘మోదీ సర్కార్ దేశానికి ఎలాంటి మేలు చేయకపోగా విద్వేషాలను రెచ్చగొట్టి అన్నదమ్ముల్లా కలిసి ఉండే జనాన్ని విడదీస్తున్నది” అని ప్రియాంక మండిపడ్డారు. .
మోదీ పాలనలో మహిళలపై దాడులు పెరిగినయ్
మోదీ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయ ని ప్రియాంక ఆరోపించారు. ‘‘మహిళల రక్షణ గురించి మాట్లాడే వీళ్లు.. నిందితులవైపే నిలబడ్డారు. ప్రధాని పదవి దేశంలోనే అత్యున్నతమైన ది. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి దేశం కోసం ఏ చేశాడో, ప్రజల కోసం ఏం చేశాడో చెప్పడు.. కానీ కన్నీళ్లు కారుస్తడు” అని అన్నారు. కాంగ్రెస్ న్యాయ పత్రం (మేనిఫెస్టో) అంటే మోదీకి భయ మని.. పాంచ్ న్యాయ్ పేరిట తాము ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ‘‘ప్రజల సంపద ప్రజలకు చేరేలా న్యాయ పత్రాన్ని తయారు చేశాం.
ఇది మోదీకి మింగుడు పడటం లేదు” అని ఆమె అ న్నారు. రైతుల కష్టార్జితానికి కనీస మద్దతు ధరను ఇచ్చేలా చట్టం రూపొందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. రుణ మాఫీ కోసం ప్రణాళిక రూపొందిస్తామని, ఉపాధి హామీ తరహాలో పట్టణాల్లో కూడా వంద రోజుల కనీస పని దినాలను కల్పిస్తామని ప్రియాంక వెల్లడించారు. కుటుంబ పెద్దగా ఉన్న మహిళ పేరిట నెలకు రూ. 8,500 చొప్పున ఏటా లక్ష రూపాయలు ఆ మహిళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని వివరించారు. ఇవన్నీ మోదీకి మింగుడు పడటం లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు.
అంబానీ, అదానీకి దోచిపెట్టిండు
‘‘పదేండ్లలో జనం కోసం ఏమీ చేయని మోదీ.. దేశ సంపదనంతా అంబానీ, అదానీ చేతుల్లో పెట్టిండు” అని ప్రియాంకగాంధీ ఆరోపించారు. ‘‘ధనవంతులకు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మోదీ మాఫీ చేసిండు. కానీ 50 వేలు, లక్ష రూపాయల రుణాన్ని కూడా చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్నడు. కష్టాల్లో ఉన్న పేదలను పట్టించుకోలేదు. వీళ్లకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు” అని పేర్కొన్నారు.
తెలంగాణకు మోదీ చేసిందేంది?
తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే వచ్చిందా? తెలంగాణకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయిస్తే.. దాన్ని మోదీ రానివ్వలే. ఇక్కడ మెడికల్ కాలేజీలు, ఐఐటీలు కూడా ఇవ్వడం లేదు” అని తెలిపారు. ‘‘తెలంగాణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.
మీరంతా ఇందిరా గాంధీకి ఎంతో ప్రేమను పంచారు. నా తల్లి సోనియా గాంధీని ఇక్కడి ప్రాంతం వారు సోనియమ్మ అని పిలిచి తల్లిగా భావించారు. మా అమ్మను మీరంతా మీ అమ్మగా చేసుకున్నారు. అందుకే మీతో నాకు సోదరసోదరి భావ సంబంధం ఏర్పడింది’’ అని ప్రజలనుద్దేశించి ప్రియాంకగాంధీ అన్నారు.
దేశం కోసం మరో ఆర్‌ను గెలిపించుకుందాం
రాష్ట్రంలో ఆర్ఆర్(రేవంత్‌రెడ్డి)ని గెలిపించుకున్నారని.. ఇప్పుడు దేశంలో మరో ఆర్(రాహుల్)ను గెలిపించుకుందామని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘రాష్ట్రంలో ఆర్ఆర్ నిజమే. ఆయనే రేవంత్ రెడ్డి. దీనికి మరో ఆర్.. రాహుల్ జోడీ అయితే అది ఆర్ఆర్ఆర్ అవుతుంది. మీరంతా ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా? అది ప్రపంచవ్యాప్తంగా ఫేమ్అయింది. మనకు కూడా రేవంత్ రెడ్డి, రాహుల్ రూపంలో ఆర్ఆర్ఆర్ ఉన్నారు. నాటు నాటును మోదీ, ఆయన మంత్రులకు వదిలేద్దాం” అని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. దేశంలో కూడా అలాంటి పాలన అందాలంటే రాహుల్ కూడా జోడీ కావాలని.. కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. దేశాన్ని సుస్థిరంగా, పటిష్టంగా ఉంచి సేవ చేసే ప్రభుత్వం కేంద్రంలో రావాలని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే.. తాండూర్ నుంచి ప్రియాంకగాంధీ
రేవంత్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో సాయంత్రం 5.25 గంటలకు కామారెడ్డికి చేరుకున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో హెలిక్యాప్టర్ దిగి వ్యాన్‌లో స్పీడ్‌గా జేపీఎన్ చౌరస్తాకు వచ్చారు. అప్పటికే సాయంత్రం 5.41 గంటలు అవుతుండటంతో ప్రియాంకగాంధీ 8 నిమిషాలు, ఆ తర్వాత రేవంత్‌రెడ్డి 4 నిమిషాలు మాట్లాడారు. 5. 58 గంటలల్లోగా తమ స్పీచ్‌లు ఆపేశారు. ఎన్నికల ప్రచార టైం సాయంత్రం 6 గంటలకే ముగియనుండటంతో ఆ లోపే ప్రసంగాలు క్లోజ్ చేశారు.
తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే వచ్చిందా? తెలంగాణకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయిస్తే.. దాన్ని మోదీ రానివ్వలే. ఇక్కడ మెడికల్ కాలేజీలు, ఐఐటీలు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీరంతా ఇందిరా గాంధీకి ఎంతో ప్రేమను పంచారు. నా తల్లి సోనియా గాంధీని ఇక్కడి ప్రాంతం వారు సోనియమ్మ అని పిలిచి తల్లిగా భావించారు. అందుకే మీతో నాకు సోదర సోదరి సంబంధం ఏర్పడింది.
ప్రియాంక గాంధీ