
- డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తీసుకుంటాం
- కామారెడ్డి జిల్లా అబ్జర్వర్ రాజ్ పాల్ కరోల
కామారెడ్డి, వెలుగు : అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ఏఐసీసీ కామారెడ్డి జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల పేర్కొన్నారు. సోమవారం సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం కామారెడ్డి జిల్లాకు పరిశీలకులు వచ్చారు. పార్టీ జిల్లా ఆఫీస్‌లో జిల్లా ముఖ్య నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2025ను పార్టీ పునరుద్ధరణ సంవత్సరంగా ప్రకటించి ఏఐసీసీ సంఘటన్ సృజన్ అభియాన్ చేపట్టిందన్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. యువత, మహిళలు, గిరిజనులు, అణగారిన వర్గాల గొంతుకగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతుందన్నారు. కులం, మతం, ధనం వంటి వాటితో సంబంధం లేకుండా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్నారు.
అట్టడుగున ఉన్న కార్యకర్తలు, నాయకులను కూడా డీసీసీ నియామకం కోసం సంప్రదిస్తామన్నారు. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాష్ర్ట నాయకత్వానికి నివేదికలు ఇస్తామన్నారు. పదవిని ఆశించే వారు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నాయకుల పని తీరును పరిశీలించి బాధ్యతలు అప్పగిస్తారన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్‌చైర్మన్ కాసుల బాల్‌రాజు, లైబ్రరీ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, యూత్ లీడర్ మహమ్మద్ ఇలియాస్, నాయకులు పండ్ల రాజు, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.