
వర్ధన్నపేట, వెలుగు: డీసీసీ అధ్యక్షుల నియామకం పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా హనుమకొండ డీసీసీ భవన్ లో సంఘటన్ సృజన్ అభియాన్ ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్నాయక్ హాజరై మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు.
అనంతరం టీపీసీసీ అబ్జర్వర్ సునీత మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయ సేకరణతోనే డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్ లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే పదవులన్నారు. సేకరించిన అభిప్రాయాలను టీపీసీసీకి సమర్పించనున్నట్లు అబ్జర్వర్లు తెలిపారు సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.