
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్లు అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు కార్యకర్తల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఎంపిక, బీఫారాలు అందజేయడంతో డీసీసీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో డీసీసీ పదవికి ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సిద్దిపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్, దర్పల్లి చంద్రం, గంప మహేందర్ రావు, రఘువర్ధన్ రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి డీసీసీ పీఠం కోసం పోటీపడుతున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలను కలుసుకొని తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో డీసీసీ పదవి కోసం పెద్దగా పోటీ కనిపించడంలేదు. జహీరాబాద్ కు చెందిన ఎన్నారై ఉజ్వల్ రెడ్డి ఒక్కరే రేసులో ఉండగా, మంత్రి దామోదర రాజనర్సింహతో సహా జిల్లాకు చెందిన ప్రముఖ నేతల మద్దతు కూడా ఆయనకు సంపూర్ణంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి మరో మారు ఆ పదవిలో కొనసాగేందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఆమెతో సహా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం ఉజ్వల్ రెడ్డి పేరును బలపరుస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాల నుంచి ఒకరిద్దరూ అధ్యక్ష పదవిపై ఆసక్తిగా ఉన్నప్పటికీ మంత్రి మెప్పు పొందలేక సైలెంట్ అయినట్టు తెలిసింది.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవిని పలువురు నేతలు ఆశిస్తున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ తోపాటు, నర్సాపూర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశీస్సులతో మరో మారు డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆది, సోమవారాల్లో మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ అభ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి రౌతేలా పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
డీసీసీ ప్రెసిడెంట్ నియామకంపై అభిప్రాయ సేకరణ
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతలతో సోమవారం ఏఐసీసీ అబ్జర్వర్ జరిత సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రెసిడెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజెంట్ ఎంపికలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు 50 ఏళ్ల లోపు వారికి 50 శాతం, మిగతా వారికి 50 శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, యూత్, మహిళా, మైనారిటీ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ కాంగ్రెస్ నేతలతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల పాల్గొన్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ ఎన్నిక
నర్సాపూర్: కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యుక్షుడిని నియమిస్తామని ఏఐసీసీ అజ్వర్వర్ జ్యోతి రౌతేలా అన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం అన్ని స్థాయిల కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు సహకరించాలని కోరారు. స్టేట్ అబ్జర్వర్ నసీర్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ జగదీశ్, వరలక్మి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి రాజి రెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి. నవీన్ గుప్తా. సుదర్శన్ గౌడ్, మల్లేశ్ పాల్గొన్నారు.