
- తెలంగాణ, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు నియమించిన ఏఐసీసీ
- పీసీసీ, ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా ఎంపికలు
- రాష్ట్రంలో 35 జిల్లాలకు త్వరలో డీసీసీ అధ్యక్షులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణతో పాటు రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ 22 మంది అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో త్వరలోనే రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం కానుందనే సంకేతాలను జాతీయ నాయకత్వం ఇచ్చింది.
తెలంగాణలోని మొత్తం 35 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరవుతారనే చర్చ పీసీసీలో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 33 రెవెన్యూ జిల్లాలకు తోడు అదనంగా పార్టీ పరంగా సికింద్రాబాద్, ఖైరతాబాద్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని ఈ కమిటీ చేపట్టనుంది.
పార్టీ కోసం పనిచేసే సమర్థులకే అవకాశం
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఈ కమిటీలో అబ్జర్వర్లుగా హైకమాండ్ నియమించింది. డీసీసీ అధ్యక్షుల నియామకంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కేవలం పార్టీ కోసం పనిచేసే సమర్థులకే అవకాశం ఇచ్చేందుకు జాతీయ నాయకత్వం తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది.ఈ అబ్జర్వర్లలో పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామితో పాటు పలువురు మాజీ కేంద్ర సహాయ మంత్రులు, మాజీ ఎంపీలు ఉన్నారు.
ఇకనుంచి దేశ వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల అమలుపై జాతీయ నాయకత్వం డీసీసీ చీఫ్‌లతో నేరుగా మాట్లాడడంతో పాటు పలు విషయాలపై దిశా నిర్దేశం చేయనున్నందున డీసీసీ అధ్యక్షుల ఎంపిక పూర్తి పారదర్శకతతో నియమించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. పీసీసీలతో ఏమాత్రం సంబంధం లేకుండా, ఆయా జిల్లా మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల పైరవీలకు తావులేకుండా నేరుగా జాతీయ నాయకత్వమే డీసీసీ చీఫ్ లను నియమిస్తుండడం విశేషం.