- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కరీంనగర్, వెలుగు: కొత్త ఆవిష్కరణలను రైతులకు అందుబాటులో తీసుకురావాలని, రైతులు కూడా కొత్త వంగడాలను సాగు చేయడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుందని మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి. సుగుణాకర్ రావుతో కలిసి ఆయన బుధవారం కిసాన్ గ్రామీణ మేళాను ప్రారంభించారు.
మేళాలోని యంత్రాలు, సీడ్స్, డెయిరీ, ఆర్గానిక్ స్టోర్స్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేసుకొని తగిన మోతాదులో ఎరువులు వాడడంతో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు సంఘటితం కావడం వల్ల తాము పండించిన పంటకు మంచి ధర పొందవచ్చన్నారు. కిసాన్ జాగరణ అధ్యక్షుడు, కిసాన్ గ్రామీణ మేళా నిర్వాహకుడు పొలసాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని, అభివృద్ధి ఫలాలు గ్రామ ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో యువత వ్యవసాయం, చేతి వృత్తులను పట్టించుకోకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం నగరాలు, పట్టణాలకు వలస వెళ్తున్నారన్నారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాజేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన యంత్రాలను రైతులు ఆసక్తిగా తిలకించారు.
