
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తోంది. ఇప్పటికే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఇక్కడ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుండగా..ఇవాళ ఆగస్టు 23న ప్రజా భవన్ గెస్ట్ హౌస్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ జూబ్లీహిల్స్ బై పోల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించిన పలు కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందుకెళ్లే వ్యూహంపై నాయకులకు దిశానిర్ధేశం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆరు నెలలలోపు ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి వుంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో స్లమ్ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో ఇక్కడ పాగా వేయాలంటే కాస్త మాస్ఫాలోయింగ్ ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్‌శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు వచ్చాయి.16,337 ఓట్లతో ఆధిక్యంతో మాగంటి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఉన్న అవగాహనలో భాగంగా మజ్లిస్ పోటీ చేయలేదు. త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో మాగంటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు సమాచారం