
విభజన చట్టంలోని ఏ హామీని సాధించని సన్నాసి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్. ఆ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అబద్ధాలు, మోసాలతోనే రాష్ట్రాన్ని పాలించారన్నారు. ధనిక రాష్టాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ఆయన పాలనలో రాష్ట్రం అవినీతి తెలంగాణ గా మారిందన్నారు.
మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసి ఏ ఒక్క ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేయలేదన్నారు శ్రవణ్. కమిషన్లు దండుకోవడానికే కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ కు ఖర్చు పెట్టారన్నారు. ఆర్థిక క్రమశిక్షణ కావాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్న కేసీఆర్ కు.. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టాలనుకున్నప్పుడు ఆ క్రమశిక్షణ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
విభజన చట్టంలోని ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని శ్రవణ్ అన్నారు. “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, కులాలకు కార్పొరేషన్ పెడతామని చెప్పి పెట్టలేదు.ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతామని పెంచలేదు. ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్స్ మెంట్ పథకం అమలు చేయడం లేదు. కేజీ టూ పీజీ అమలు చేయలేదు.”అని ఆయన అన్నారు.
విద్యారంగం పై దేశంలోనే అతి తక్కువ ఖర్చుపెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన శ్రవణ్.. ఆ రంగానికి కేవలం 6 శాతం ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వైద్య రంగానికి కేవలం 3.5 శాతం ఖర్చు పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ నంబర్ వన్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. లిక్కర్ ఆదాయాన్ని 22వేల కోట్ల రూపాయలకు పెంచుకోవడంలో మాత్రమే తెలంగాణ ప్రగతి సాధించిందని ఎద్దేవా చేశారు. పేద ప్రజల జీవితాలతో అడుకుంటున్నారు.