U-19 Asia Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. మాత్రే, సూర్యవంశీ విఫలమైనా శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ

U-19 Asia Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. మాత్రే, సూర్యవంశీ విఫలమైనా శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ

అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ కు దూసులకెళ్లింది. శ్రీలంకపై  శుక్రవారం (డిసెంబర్ 19) జరిగిన సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా ఐసీసీ అకాడమీలో 20 ఓవర్లకు కుదించిన ఈ సెమీస్ సమరంలో భారత జట్టు పెద్దగా కష్టపడకుండానే అలవోక విజయాన్ని సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాటు తర్వాత ఛేజింగ్ లో ఆరోన్ జార్జ్ (58), విహాన్ మల్హోత్రా (61) చెలరేగి ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. 

139 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 8 బంతులాడి కేవలం 7 పరుగులే చేసి ఔటయ్యాడు. కాసేపటికీ వైభవ్ సూర్యవంశీ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన కు చేరాడు. దీంతో ఇండియా 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి 5 ఓవర్లలో ఇండియా 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. మొదట్లో కాస్త తడబడినా ఆ తర్వాత వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 114 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడం విశేషం. 

తక్కువ స్కోర్ కే లంక: 

వర్షం కారణంగా మొదట బ్యాటింగ్ చేయాల్సిన వచ్చిన శ్రీలంకకు మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టు 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దుల్నిత్ సిగేరా (1), విరాన్ చాముదిత (19), కవిజ గమాగే (2) ముగ్గురూ తక్కువ స్కోర్ కే ఔటై నిరాశపరిచారు.ఈ దశలో శ్రీలంక జట్టును విమత్ దిన్సారా, చమిక హీనతిగల ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. జట్టు వికెట్ల పతనాన్ని ఆపుతూ భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించిన తర్వాత లంక కెప్టెన్ విమత్ దిన్సారాను కనిష్క్ చౌహాన్ పెవిలియన్ కు పంపాడు. 

►ALSO READ | IND vs SA: ఐదో టీ20లో టీమిండియా బ్యాటింగ్.. ప్లేయింగ్ 11 నుంచి గిల్, హర్షిత్, కుల్దీప్ ఔట్

కెప్టెన్ ఔట్ కావడంతో శ్రీలంక 73 పరుగుల వద్ద నాలుగో వికెట్ ను కోల్పోయింది.  కిత్మా విథనాపతిరణ, ఆదం హిల్మీ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోవడంతో లంక జట్టు 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సేథ్మికా సెనెవిరత్నే, చమిక హీనతిగల అద్భుతంగా ఆడుతూ లంక జట్టుకు ఒక మాదిరి స్కోర్ ను అందించారు. సేథ్మికా సెనెవిరత్నే 22 బంతుల్లోనే 30 పరుగులు చేసి చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.