అక్టోబర్ 24న తెలంగాణలోకి జూడో యాత్ర

అక్టోబర్ 24న తెలంగాణలోకి జూడో యాత్ర

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, వారి మధ్య వైషమ్యాలను బీజేపీ రెచ్చగొడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. తినే తిండి, వేసుకునే బట్ట, పూజించే దేవుళ్ల పేరుతో ప్రజల మధ్య గొడవలు పెడుతుందని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులపై దాడులు పెరిగాయని, రాజ్యంగాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి, భారత్ జోడో యాత్ర కన్వీనర్ బలరాం నాయక్, సీనియర్ అధికార ప్రతినిధులు బెల్లయ్య నాయక్, తివారిలతో కలిసి ఖేరా భారత్ జోడో యాత్ర వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 3,590 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. దేశ ప్రజలను ఏకం చేసేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు ఆయన వివరించారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమై జమ్మూకశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా యాత్ర జరగనుందని పవన్‌‌‌‌ ఖేరా తెలిపారు. రోజూ ఉదయం, సాయంత్రం 25 కి.మీ. నడిచేలా షెడ్యూల్‌‌‌‌ రూపోందించామని చెప్పారు. 

వచ్చే నెల 24న తెలంగాణలోకి.. 
అక్టోబర్ 24న జూడో యాత్ర తెలంగాణలోకి ఎంటర్ అవుతుందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ఎంటరై, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కుల్ నియోజకవర్గంలో ముగుస్తుందని చెప్పారు. 4 లోక్‌‌‌‌సభ ,9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుందని పేర్కొన్నారు.