IND vs SA: మార్క్రామ్ స్టన్నింగ్ క్యాచ్‌కు నితీష్ షాక్.. వీడియో వైరల్

IND vs SA: మార్క్రామ్ స్టన్నింగ్ క్యాచ్‌కు నితీష్ షాక్.. వీడియో వైరల్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. మూడో రోజు టీ విరామం తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన మన జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయింది. అంతకముందు తొలి సెషన్ లో నాలుగు వికెట్లు చేజార్చుకోవడంతో కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ రెండో సెషన్ లో హైలెట్ గా నిలిచాడు. భారత పిచ్ లపై బౌన్సర్లు విసురుతూ ఈ ఒక్క సెషన్ లోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొదట పంత్ ను ఔట్ చేసిన ఈ సఫారీ పేసర్.. ఆ తర్వాత వరుసగా నితీష్ కుమార్ రెడ్డి, జడేజాలను పెవిలియన్ కు పంపాడు. 

ముఖ్యంగా నితీష్ వికెట్ బ్యాడ్ లక్ అని చెప్పాలి. మార్క్రామ్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్‌కు నితీష్ ఔటయ్యాడు. జాన్సెన్ వేసిన బౌన్సర్ ను ఆడే క్రమంలో నితీష్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి గల్లీ వైపుగా వెళ్ళింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రామ్ దూరంగా వెళ్తున్న బంతిని డైవ్ చేస్తూ అందుకున్నాడు. మార్క్రామ్ స్టన్నింగ్ క్యాచ్‌కు నితీష్ షాకయ్యాడు. సూపర్ మ్యాన్ తరహాలో అందుకున్న ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నితీష్ ఔటవ్వడంతో ఇండియా ఆరో వికెట్ కోల్పోయింది. గాయం తర్వాత తిరిగొచ్చిన నితీష్ బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా తీసుకోకపోగా.. బ్యాటింగ్ లో 10 పరుగులే చేసి నిరాశపరిచాడు. 

ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 353 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో సుందర్ (16), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. హార్మర్ రెండు.. మహరాజ్ కు ఒక వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 153 పరుగులు చేయాల్సి ఉంది. లోయర్ ఆర్డర్ లో సుందర్ ఈ మాత్రం పోరాడతాడో చూడాలి.