
- ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ రాఫేల్స్
- 114 ఫైటర్ జెట్లకు ఐఏఎఫ్ ప్రపోజల్
- పరిశీలిస్తున్న కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖలు
- హైదరాబాద్‌లో మెయింటనెన్స్, రిపేర్ సెంటర్!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు వణుకు పుట్టించిన రాఫేల్ ఫైటర్ జెట్లను మరిన్ని సమకూర్చుకునేందుకు భారత వాయుసేన ప్రపోజల్ పెట్టింది. కొత్తగా 114 మేడ్ ఇన్ ఇండియా రాఫేల్స్ కొనుగోలుకు ఐఏఎఫ్ ప్రపోజల్ పెట్టగా.. కేంద్ర ఆర్థిక శాఖ, రక్షణ శాఖ పరిశీలిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 2 లక్షల కోట్ల వ్యయం కానున్నట్టు అంచనా వేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా రాఫేల్ ఫైటర్ జెట్లలో దాదాపు 60% భాగాలు ఇక్కడే తయారు చేయించనున్నారు. ఇప్పటివరకూ ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ అక్కడే రాఫేల్ జెట్లను తయారుచేసి, భారత్ కు అందిస్తూ వచ్చింది. ఇకపై భారత్‌లోనే ఇండియన్ కంపెనీలతో కలిసి వీటిని తయారుచేసిచ్చేలా రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. కాగా, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ పీఎల్ 15 మిసైల్స్ నుంచి రాఫేల్ ఫైటర్ జెట్లు చాకచక్యంగా తప్పించుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో పాక్ పై ఐఏఎఫ్ స్కాల్ప్ మిసైల్స్‌ను కూడా ప్రయోగించాయి. అయితే, మేడ్ ఇన్ ఇండియా రాఫేల్స్లో స్కాల్ప్ మిసైల్స్‌కు బదులు లాంగ్ రేంజ్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులను ప్రయోగించేలా మార్పులు చేస్తారు. వీటి కొనుగోలుకు కేంద్రం ఓకే చెప్తే గనక.. హైదరాబాద్‌లో రాఫేల్ ఎం88 ఇంజన్ల తయారీకి డసాల్ట్ కంపెనీ మెయింటెన్స్, రిపేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.