
- ముంబైలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారిపోయిన ఫ్లైట్
ముంబై: కొచ్చి నుంచి ముంబైకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఏఐ-2744 విమానం రన్‌వే నుంచి జారిపోయింది. ఈ ఘటనతో విమానం ఇంజన్‌తో పాటు మూడు టైర్లు దెబ్బతిన్నట్టు తెలిసింది. రన్‌వేకు కూడా స్వల్ప నష్టం వాటిల్లినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం ఉదయం 9:27 గంటలకు ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. అయితే, విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షం, తడి రన్‌వే నే ఈ ఘటనకు ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. ముంబైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తాయి.
రవాణా సేవలను అస్తవ్యస్తం చేశాయి. విమానాశ్రయ అధికారులు ఉదయం ఒక హెచ్చరిక జారీ చేసి, ప్రయాణికులు తమ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని, ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. ఘటన అనంతరం విమానాన్ని తనిఖీల కోసం గ్రౌండ్ చేశారు. భారత విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ఈ ఘటనపై విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. రన్‌వేలో జరిగిన స్వల్ప నష్టాన్ని సరిచేసే పనులు కొనసాగుతున్నాయి.