
విదేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను మే నెలలో ప్రారంభించింది. అందులో భాగంగా దుబాయ్ నుంచి కేరళకు వస్తున్న విమానం రెండు రోజుల క్రితం కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. ఆ విమాన ప్రమాదం తర్వాత మళ్లీ వందే భారత్ మిషన్ లో భాగంగా భారతీయులను తీసుకొచ్చే విమానాలు మొదలయ్యాయి. ఈ రోజు సిడ్నీ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. విదేశాల్లో చిక్కుకున్న వారికోసం ఏర్పాటుచేసిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ఏఐ-301 సిడ్నీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అందుకే భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను వెనక్కి తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది భారతీయులను వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇండియాకు తీసుకువచ్చారు. ఒక్క ఆదివారం రోజే దాదాపు 6000 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు ఏవియేషన్ మినిష్టర్ హరిదీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఎయిర్ ఇండియా ప్రత్యేకవిమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరినట్లు సిడ్నీలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది.